
Telugu Akademi funds scam: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు పట్టు సాధిస్తున్నారు. నేరానికి పాల్పడిన నిందితులను పదిమందిని అరెస్టు చేశారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీతో కుమ్మక్కై డిపాజిట్లను కాజేశారు. గతంలో కూడా ఈ ముఠా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కమీషన్ పై ఆశతో బ్యాంకు, అకాడమీ సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమానికి తెర తీశారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఏడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో ఇందులో ఎవరెవరి హస్తం ఉందని ఆరా తీస్తున్నారు. ఖాతాల నుంచి మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్లాయని విచారణ చేస్తున్నారు.
నిధుల గోల్ మాల్ పై త్రిసభ్య కమిటీ వేసి నిగ్గు తేల్చాలని చూస్తున్నారు. నిధుల గల్లంతుపై నివేదిక తయారు చేస్తోంది. అకాడమీలో డబ్బులు ఎలా బయటకు వెళ్లాయి? నిధుల అక్రమంలో ఎవరి హస్తం ఉంది? ఎంత మంది ఉన్నారు? తదితర విషయాలపై కూలంకషంగా విచారణ చేపడుతోంది. రూ.64 కోట్ల కుంభకోణంలో త్రిసభ్య కమిటీ పలు కోణాల్లో విచారణ సాగుతోంది.
గతంలో డైరెక్టర్ గా పనిచేసిన సత్యనారాయణ, సోమిరెడ్డి ల నిర్లక్ష్యంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిపై విచారణ చేపడుతున్నారు. మూడు ఖాతాల నుంచి నిధుల పక్కదారి పట్టాయని సమాచారం. ఇంకా 31 ఖాతాల్లో నిధులు భద్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అకాడమీ ఖాతాల్లో రూ.340 కోట్ల నిధులుండగా రూ.64 కోట్ల డిపాజిట్లు దారి మళ్లాయి. కార్వాన్ బ్యాంకు ఖాతా ుంచి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ ఖాతా నుంచి రూ.12 కోట్లు, చందానగర్ ఖాతా నుంచి రూ.10 కోట్లు గల్లంతయ్యాయి.