
తెలంగాణలో విమానాశ్రయాలు కరువే. ఒక్క శంషాబాద్ లోనే పెద్ద ఎయిర్ పోర్టు ఉంది. ఇంకా బేగంపేటలో ఒక్కటి ఉంది. దీంతో విమానాశ్రయాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, కడప, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
కానీ తెలంగాణలో హైదరాబాద్ లో తప్ప మరెక్కడా లేవు. ఈ కొరతను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత దేశీయ తరువాత అంతర్జాతీయ అవసరాలు తీర్చేలా ఎయిర్ పోర్టులు నిర్మించాలని ఉద్దేశించింది. విమానాశ్రయాల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదైనందున ఫేజ్-1, ఫేజ్ -2 పేరుతో విభజించారు.
ఫేజ్ -1లో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా నిర్మిస్తారు. ఫేజ్ -2లో పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో వరంగల్ లో ఫేజ్-2 విమానాశ్రయం నిర్మించాలని ఆలోచిస్తోంది. ఆ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో అక్కడ భారీ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది.
నిబంధనల ప్రకారం ఒక విమానాశ్రయానికి మరో విమానాశ్రయానికి మద్య దూరం 150 కిలోమీటర్లు చూపించాలి. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే ఎయిర్ పోర్టుకు అనుమతులు రావు. ఈ కారణంతో మహబూబ్ నగర్ లో ఎయిర్ పోర్టు విషయంలో అభ్యంతరాలు వచ్చే వీలుందని తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహించే జీఎంఆర్ తో చర్చలు జరిపి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో నిర్మించాలని భావిస్తున్న ఎయిర్ పోర్టుకు మార్గం సుగమం చేయాలనుకుంటున్నారు.