
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధలా చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం కరోనా నివారణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆదివారం నాటికి తెలంగాణలో 70మంది కరోనా పాజిటివ్ కేులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 11మంది కోలుకున్నారని వీరికి టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. ఏప్రిల్ 7నాటికి తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారనుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రాణాంతక కరోనా వైరస్ పై సాగిస్తున్న పోరులో ప్రభుత్వం గణనీయమైన ఫలితాలని సాధిస్తుందని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిని సోమవారం డిశ్చార్జి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో 70కరోనా కేసులు నమోదుకాగా ఒక వ్యక్తి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. మరో 11మందికి నెగెటివ్ రావడం సంతోషంగా ఉందన్నారు. దీంతో బాధితుల సంఖ్య 58మందికి చేరుతుందన్నారు. వీరికి మరోసారి టెస్టులు నిర్వహించి డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 25,937మంది కారంటైన్లో ఉన్నారని తెలిపారు. వీరికి 14 రోజుల పరిశీలన పూర్తయ్యాక వారిలో కరోనా లక్షణాలేవీ లేనట్లయితే వారినికూడా డిశ్చార్జ్ చేస్తామన్నారు.
మార్చి 30నాటికి 1,899మంది, 31నాటికి 1,450మందిని.. ఇలా దశలవారీగా కరోనా నుంచి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 7నాటికి రాష్ట్రంలోని పాజిటివ్ కేసులన్నీ నెగెటివ్ గా మారతాయనే ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. మొత్తంగా ఏప్రిల్ 7తర్వాత రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బాధితులు ఉండరని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వానికి ప్రజలందిస్తున్న సహకారం మరువలేనదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపారు. కరోనా నివారణకు స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను ఎదుర్కోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు.