Reopening of schools: ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. కరోనా (Coronavirus) మొదటి వేవ్ తో గత ఏడాది మార్చిలో పడిన లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఒకప్పుడు విద్యార్థులు స్కూలుకు(Schools) వెళ్లమని మారాం చేసేవారు. ఇప్పుడు ఏడాదిన్నర ఇంట్లో ఉండి ఉండి.. బయటకు వెళ్లలేక మేం స్కూళ్లకు వెళతాం మొర్రో అని అల్లరి చేస్తున్న పరిస్థితి. అందరికీ ఇంట్లో తెగబోర్ కొట్టేసింది. ఇప్పటికైనా చదువులు చక్కబడాలని అందరూ వెయ్యినొక్క దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.
విద్యాసంస్థలు సంవత్సరన్నర మూసివేయడంతో ఇంట్లో ఉంటూ ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులు టార్చర్ అనుభవిస్తున్నారు. పాఠం అర్థంకాకుండా.. స్వేచ్ఛ లేకుండా కండ్లు కాయలు కాస్తున్న ఈ-చదువులు ఏంట్రా బాబూ అంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్వాపరాలను పరిశీలించి అందరి అభిప్రాయాలను స్వీకరించి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అంగన్ వాడీ కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష తరగతులు మొదలు పెట్టాలని సూచించింది.
విద్యాసంస్థలు తెరిచిన తర్వాత రెసిడెన్షియల్, పాఠశాలల్లోని పిల్లలకు జ్వర సూచనలు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సమీపంలోని పీహెచ్.సీకి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒకవేళ కరోనా నిర్ధారణ అయితే సదురు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు.
ఈనెల 30లోగా గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలను , వసతి గృహాలను శుభ్రపరిచి శానిటైజేషన్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కరోనాతో విద్యాసంస్థలు మూతపడి మొత్తం విద్యావ్యవస్థనే అతలాకుతలమైందని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున: ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో జనసంచారం సాధారణ పరిస్థితుల్లో ఉంది. ఈక్రమంలోనే పలు జాగ్రత్తలతో ఒకటో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను మళ్లీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థులు పాఠశాలల్లో తరగతులకు హాజరయ్యే వారు తప్పనిసరిగా శానిటైజేషన్ చేసుకోవడం.. మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించారు. మాస్కులు ధరించాలి.. నిబంధనలు పాటించేలా చూడాలని తల్లిదండ్రులను కేసీఆర్ కోరారు. అయితే ఆన్ లైన్ క్లాసులు కూడా కొనసాగుతాయని.. విద్యార్థులను పాఠశాలలకు పంపడం తల్లిదండ్రుల ఇష్టం అని ప్రభుత్వం పేర్కొంటోంది. ఏదైతేనేమీ కరోనా తగ్గడం.. చదువులు చక్కబడుతుండడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.