
ఓ వైపు ఆక్సీజన్, రెమ్ డెసివర్ వంటి మందుల కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తుండగా.. మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా ఇబ్బందులపాలు చేస్తోంది. ఇది అన్ని రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. దేశంలో ముందు నుంచి కొవాగ్జిన్, కొవి షీల్డ్ టీకాలు వేస్తుండగా.. తాజాగా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు సైతం భారత్ అనుమతి ఇచ్చింది. ఈ టీకా ఇప్పుడే దేశానికి దిగుమతి అవుతోంది.
అయితే.. కొవాగ్జిన్, కొవి షీల్డ్ టీకాల సరఫరా అంతంత మాత్రంగా ఉండడంతో.. వ్యాక్సినేషన్ సజావుగా సాగట్లేదు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కానీ.. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందకపోవడంతో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకను తలపిస్తోంది.
ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరీ దారుణంగా ఉంది. దీంతో.. వ్యాక్సిన్ కేంద్రాలకు మూడునాలుగు సార్లు తిరిగినా అందట్లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో కొవాగ్జిన్ టీకా రెండో డోసును నిలిపేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్రం నుంచి అందాల్సిన స్టాక్ రాలేదని తెలిపిన రాష్ట్ర సర్కారు.. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ టీకాల కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే.. కొవిషీల్డ్ టీకా పంపిణీ గురించి మాత్రం కొత్తగా ఏవిధమైన ప్రకటన చేయలేదు.
కాగా.. కొవీషీల్డ్ రెండో డోసు మధ్య వ్యవధిని పెంచుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం ఆదివారం కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకూ 8 నుంచి 12 వారాల మధ్య సెకండ్ డోస్ వేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా.. 12 వారాల తర్వాతనే సెకండ్ డోస్ ఇవ్వాలని ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి పాత పద్ధతిలో ఇవ్వాలని.. కొత్తగా వచ్చేవారికి మాత్రం 84 రోజులు దాటిన తర్వాతనే రెండో డోసు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. తమకు వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.