
Telangana Debts: రాష్ట్ర ప్రభుత్వ అప్పు పరిమితి ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన మేర రాష్ట్ర ప్రభుత్వం అప్పును సేకరించింది. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున ఈ నెల 21 నాటికే పరిమితిని చేరుకుంది. ఈసారి కార్పొరేషన్ల గ్యారంటీ అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ అప్పుల్లోనూ కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,970 కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం దీనిలో రూ.15,033 కోట్లకు కోత పెట్టి, రూ.38,937 కోట్ల మేర రుణం తీసుకోవడానికి అనుమతించింది.
35 వేల కోట్ల అప్పు
ఇందులో ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రం రూ.35 వేల కోట్ల అప్పును సేకరించింది. ఫిబ్రవరి 28న రూ.1,000 కోట్లు, ఈ నెల 6న రూ.1,000 కోట్లు, 14న రూ.650 కోట్లు, 21న రూ.2,500 కోట్ల మేర అప్పులు తీసుకున్నది. దీంతో ఈ నెల 21 వరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్పుల మొత్తం రూ.40,150 కోట్లకు చేరింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రూ.38,937 కోట్లకే అనుమతించినట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
కొంత ఊపిరి పీల్చుకుంది
అయినా దానికంటే మరో రూ.1,213 కోట్లను అప్పు కింద తీసుకున్నది. ఏమైనా రూ.40 వేల కోట్ల అప్పును తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నెల 21 నాటికే ఈ టార్గెట్ పూర్తి కావడంతో ఈ నెల 24న అప్పు కోసం ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్లు పెట్టలేదు. కాగా, దేశంలోని 15 రాష్ట్రాలు రూ.40,713 కోట్ల అప్పుల కోసం ఇండెంట్లు పెట్టాయి. వీటికి ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం నిర్వహించనుంది.

ఈ సారి ఏం చేస్తుందో?
గ్యారెంటీ అప్పులు, బడ్జెట్ అప్పుల్లో షరతులు పెట్టిన కేంద్రం.. ఈ ఏడాది ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వానికి తక్కువలో తక్కువ రూ.25 వేల కోట్లు కావాలి. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో అధికార బీఆర్ఎస్ను బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదాయం కోసం అనేక మార్గాలను బీఆర్ఎస్ అనుసరిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ మరిన్ని షరతులు పెడుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పవు. ఇదే నెపాన్ని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు రెడీ అవుతోంది!