
Telangana Politics : తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షాలది ఒకటే టార్గెట్.. అది రెండు సార్లు అప్రతిహతంగా అధికారం సాధించిన సీఎం కేసీఆర్(CM KCR) ను ఓడించడం.. ఎలాగైనా సరే గద్దెదించడం.. ఇన్నాళ్లు ఆడింది ఆటగా.. పాడింది పాటగా కేసీఆర్ కు ఇప్పుడు ప్రశాంతత కరువైంది. ఓవైపు బీజేపీ దూకుడు.. కొత్తగా పీసీసీ చీఫ్ అయిన రేవంత్(Revanth Reddy) రాకతో బలోపేతమైన కాంగ్రెస్.. మధ్యలో నిరుద్యోగ సమస్య చేపట్టి జోరీగల ‘వైఎస్ షర్మిల’(Sharmila). ఇక కొత్తగా బీఎస్పీలో చేరిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. వెరిసి తెలంగాణలో రాబోయే ఎన్నికలు అంత ఈజీ కాదన్న విషయం సీఎం కేసీఆర్ కు అర్థమవుతూనే ఉంది.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ లు అధికారికంగా నిర్వహించాలని రెండు భారీ సభలు నిర్వహించాయి. నిర్మల్ సభకు ఏకంగా దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తులో రెండోవారు అయిన కేంద్రహోంమంత్రి అమిత్ షా రావడంతో మీడియా ఫోకస్ అంతా అటువైపు మళ్లింది.
అమిత్ షా ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ ను తక్కువగా టచ్ చేసి మజ్లిస్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలే అమిత్ షా-కేసీఆర్ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. బహుషా ఆ ఎఫెక్ట్ తోనే అనుకుంటా కేసీఆర్ ను తక్కువ తిట్టి ప్రధానంగా మజ్లిస్ ను, బీజేపీపై ప్రశంసలతోనే అమిత్ షా పరిమితమయ్యారని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలంతా కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటే.. అమిత్ షా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశమైందని అంటున్నారు. నిజాం రాజు, రజాకర్లు, మజ్లిస్ టార్గెట్ అమిత్ షా వ్యాఖ్యలు సాగడం గమనార్హం.
ఇక సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో కాంగ్రెస్ సభ పెట్టింది. కేసీఆర్ పాలనతీరుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే నేతలంతా నిప్పులు చెరిగారు. గజ్వేల్ సభకు కాంగ్రెస్ వాదులు భారీగా తరలివచ్చారు. మీడియాలోనూ దీన్ని ఫోకస్ చేశారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి సహా నేతలంతా ‘కేసీఆర్ ’ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో, మీడియాలో ట్రెండింగ్ చేశారు.
నిర్మల్ సభలో అమిత్ షా రాకతో ప్రధాన మీడియా అంతా ఫోకస్ చేసింది. సోషల్ మీడియాలోనూ బీజేపీ శ్రేణులు హల్ చల్ చేశారు. ఇటు కాంగ్రెస్ వాదులు తమ గజ్వేల్ సభను విజయవంతం అని ప్రచారం చేశారు. అయితే కేసీఆర్ ను ఢీకొట్టేలా చేయడంలో బీజేపీ వెనుకబడినట్టు కనిపించగా.. కాంగ్రెస్ మాత్రం గట్టిగా టార్గెట్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.
కేంద్రంలోని బీజేపీకి కేసీఆర్ తో ఉన్న స్నేహం రాష్ట్ర బీజేపీపై ఎఫెక్ట్ పడుతోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు . అదే కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయం చేస్తుండడం ఇక్కడ ఆ పార్టీకి ప్లస్ గా మారిందని అంటున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై పోరాటం విషయంలో తన విజన్ ను వెల్లడించి ప్రజలు, కార్యకర్తల్లో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీలో మాత్రం కేంద్ర నేతలు మెతకగా.. రాష్ట్ర నేతలు పరుషంగా నిలబడుతున్నారు.
మొత్తంగా కేసీఆర్ విషయంలో ఇన్నాళ్లు బీజేపీ ధీటుగా నిలబడగా.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పైకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఫుల్ పాలిటిక్స్ మొత్తం కేసీఆర్ టార్గెట్ గానే సాగుతున్నాయి. అందుకే రాష్ట్రంలో ప్రత్యామ్మాయ పార్టీ విషయంలో కాంగ్రెస్ కు కొంత మెరుగైన పరిస్థితి రావచ్చు అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.