Telangana Politics BJP vs Congress : తెలంగాణలో బీజేపీ బలహీనపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలపడుతోంది. బీజేపీలోని ఈటల రాజేందర్ సహా కొంత దిగ్గజ నేతలు సైతం ఇప్పుడు బీజేపీ విధానాలను, వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ఇక బీజేపీలో చేరికకు రెడీ అయిన పొంగులేటి, జూపల్లి లాంటి సీనియర్లు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. చాలా మంది బీజేపీ నేతలు ఆ పార్టీలో ఉంటే గెలవమని.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఇటీవల బీజేపీ తెలంగాణలో చాలా బలహీనపడుతోంది. బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే రీతిలో పార్టీని తీసుకువచ్చారు. అయితే కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే చేజేతులా పార్టీకి వచ్చిన హైప్‌ను తొక్కేస్తున్నారు. విధానాలపై కూడా క్లారిటీ లేకపోవడం పార్టీ క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే తగ్గుతున్న పార్టీ హైప్‌ను ఇలాంటి ఘటనలు మరింత పడిపోయేలా చేస్తున్నాయి.
శనివారం ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్ మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. మమ్మల్ని ఢిల్లీకి పిలిచి కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని శరణార్థులు అంటున్నారని, దీనికి బండి సంజయ్ కూడా కారణమని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ” మాపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి నిజమే. భారత రాష్ట్ర సమితి మెతక వైఖరి అవలంబించడం వల్ల క్షేత్రస్థాయిలో మేము ఇబ్బంది పడుతున్నాం. మా కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారు” అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. ఆయాచిత వరం లాగా లభించిన లిక్కర్ స్కామ్ కేసులోనూ విచారణకు సంబంధించి బిజెపి కేంద్ర పెద్దలు మొదట్లో చూపించిన దూకుడు ఇప్పుడు ప్రదర్శించకపోవడంతో స్థానిక నాయకత్వంలో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది. ఇక దీనికి కర్ణాటక ఎన్నికల్లో ఓటమి కూడా తోడు కావడంతో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలం పెంచుకుంది. భారత రాష్ట్ర సమితిలోని అసంతృప్త నాయకులకు గాలం వేస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇక ఇలాంటి పరిణామాలను చూస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అధిష్టానం మీద గరంగా ఉన్నారు. కవితను అరెస్టు చేస్తేనే పార్టీ పునర్ వైభవం పొందుతుందని అంటున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
పరిణామాలన్నీ చూస్తున్న బీజేపీ నేతలు కమలం కంటే కాంగ్రెస్ బెటర్ అని అనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వచ్చేవారిని సైతం రావద్దని అంటున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లిలాంటి వారు కూడా బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మొత్తం బీజేపీ బలహీనపడుతుండగా.. కాంగ్రెస్ బలోపేతం అవుతోంది.