Homeజాతీయ వార్తలుతెలంగాణ పట్టణ ప్రగతి అభినందనీయం

తెలంగాణ పట్టణ ప్రగతి అభినందనీయం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పట్టణ ప్రగతి కార్యక్రమం అభినందించదగ్గది. ఇంతకుముందు తీసుకున్న పల్లె ప్రగతి కి కొనసాగింపుగానే ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది. రాజకీయాలు ఎప్పుడూ వుండేవే . కానీ ప్రజలకు తక్షణం ఉపయోగపడేవి పౌర సౌకర్యాలు. నిన్నటి ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడంటే కేవలం పౌర సౌకర్యాలపై ప్రజలు సంతృప్తి చెందారు కాబట్టే గెలిచాడు. నిజానికి ఇది పార్టీల ప్రధాన ఎజెండా కావాలి. నూటికి 90 శాతం ప్రజలు కోరుకునేది పౌర సౌకర్యాల మెరుగుదల. అవి సమకూరిన తర్వాత మిగతా వాటిగురించి ప్రజలు ఆలోచిస్తారు. ఈ విషయంలో కెసిఆర్ వీటిపై ఫోకస్ చేయటం ఖచ్చితంగా అభినందనీయం.

ఈ నెల 16 వ తేదీన తెలంగాణ మంత్రివర్గం ఈ విషయాలపై చర్చించి కార్యాచరణ పధకాన్ని ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా ఈరోజు ప్రగతి భవన్ లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల చైర్మన్లు, అధ్యక్షుల తో ముఖ్యమంత్రి కెసిఆర్ సవివరంగా చర్చించటం హర్షణీయం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వ మంచి పనుల్లో మణిపూసలు గా నిలిచిపోవటం ఖాయం. నిర్దిష్ట కార్యాచరణలో భాగంగా చేయాల్సిన పనులు మార్గదర్శకం చేయటం జరిగింది. అందులో కొన్ని పరిశుభ్రత, పచ్చదనం, మంచినీటి సరఫరా , రహదారుల అభివృద్ధి , ప్రభుత్వ స్థలాల గుర్తింపు, కేటాయింపు, శ్మశానాల కోసం స్థలాల గుర్తింపు, డంప్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్లు , వెజ్ , నాన్ – వెజ్ మార్కెట్ స్థలాల గుర్తింపు,విద్యుత్తు స్థంబాల సమీక్ష, పరిశుధ్యపనుల కోసం వాహనాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు ని తయారు చేసారు. దీనికి నిధులు కూడా కేటాయించారు. అందుకే ఈ కార్యక్రమం ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పొచ్చు.

ఇదేదో ఎన్నికలకోసం చేస్తున్నది కాదు. వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తున్నది. కెసిఆర్ కి ప్రాధాన్యతా అంశాల్లో ఈ కార్యక్రమాలు ఉండటం ముదావహం. ఏదో మొక్కుబడిగా చెప్పటం కాకుండా సీరియస్ గా తీసుకొని అమలుచేయడం విశేషం. సమస్యల్లా అదే నిబద్దత కింద క్యాడర్లో కూడా ఉండకపోవటం. కాకపోతే కెసిఆర్ అంటే భయంతో కొంతమేరకైనా అమలుచేస్తారని ఆశిద్దాం. దీనికోసం వార్డుల్లోని ప్రజలు పెద్దఎత్తున కదలాలి. నాయకులు ముందుగా పత్రికల్లో ప్రచారం కల్పించి ఎక్కువమంది పాల్గొనేటట్లు చేయాలి. ఏ కార్యక్రమమైనా ప్రజలు పాల్గొంటే విజయవంతమవుతుంది. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు కెసిఆర్ ని మనసారా మరొక్కసారి అభినందిద్దాం.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
RELATED ARTICLES

Most Popular