
బెంగళూరు డ్రగ్స్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూడగా.. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇందులో భాగం పంచుకున్నట్లుగా వెల్లడైంది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకొని విచారించారు. వారి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. ప్రధాన సూత్రధారి అయిన హైదరాబాద్ వ్యాపారి కల్‌హర్‌రెడ్డి కూడా నోరు విప్పేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా హైదరాబాద్ వ్యాపారి కల్‌హర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన ప్రస్తుతం గోవిందపుర పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ట్రావెల్స్ యజమాని రతన్ రెడ్డి కూడా తన వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ బుధవారం లోపు వీరి స్టేట్‌మెంట్ రికార్డు చేసి ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం ఏ మేరకు ఉందో తెలుసుకోనున్నారు.
ఈ కేసులో సూత్రధారి అయిన కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ బెంగళూరులోని డాలర్స్ కాలనీలో బెంగళూరులో ఏర్పాటు చేసే పార్టీలకు నిత్యం తెలంగాణ నుంచి చాలా మందే అటెండ్ అయ్యేవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శంకరగౌడ నుంచి పలు వివరాలు సేకరించిన పోలీసులు.. మరోసారి ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన ఓ చిన్న హీరోకు సైతం సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
ఇప్పటికే గత శనివారం కల్‌హర్ రెడ్డిని ఒకసారి విచారించగా.. పలువురి ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. దీంతో రతన్‌రెడ్డిని సైతం విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే.. ఈ కేసులో ఈ ఇద్దరి వాంగ్మూలమే కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన పేర్లే కాకుండా రికార్డుల్లోకి రాకుండా ఇంకొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లుగా బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఈ కేసులో ఎమ్మెల్యేల పేర్లు వెలుగు చూడడంతో పోలీసులు ఆచితూచి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. వీరి స్టేట్‌మెంట్ రికార్డు చేసి తదుపరి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వారిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు నమ్ముతున్నారు.