Mallu Swarajyam: అరుణకిరణం అస్తమించింది. సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న స్వరాజ్యం ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజా సమస్యల పక్షాన నిలిచింది. అలుపెరగని పోరాటంలో ఎప్పుడు వెనుదిరగలేదు. జీవన గమనంలో కూడా ఆమె వెనక్కి చూడలేదు. ఎప్పుడు ముందుండి పోరాటాలు నడిపించడమే ధ్యేయంగా కదిలారు. మహిళ అయినా సమస్యల పరిష్కారంలో తనదైన శైలి అనుసరించే వారు. రజాకార్లతో జరిగిన పోరాటంలో కూడా ఆమె తన పాత్ర పోషించారు.
స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో జన్మించారు. రాంరెడ్డికి నర్సింహారెడ్డి, శశిరేఖ, సరస్వతి, స్వరాజ్యం, కుశలవరెడ్డి లతో ఆరుగురు సంతానం. దొరల పాలన అంతం కావాలని 11 ఏళ్ల వయసులోనే పోరుబాట పట్టిన ధీర వనిత స్వరాజ్యం. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు.
Also Read: రాజకీయాల్లో వాడుకొని వదిలేశారు..మోసపోయా..మోహన్ బాబు సంచలన వ్యాఖ్యల వెనుక కథేంటి?
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిన్నతనం నుంచే విప్లవ భావాలతో సమాజ ఉద్దరణ కోసం నడుం బిగించింది. సాయుధ పోరాటంలో మల్లు వెంకటనర్సింహారెడ్డితో 1954 మే నెలలో స్వరాజ్యం వివాహం జరిగింది. వీరి వివాహానికి బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వర్ రావు సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. నైజాం సర్కారుపై అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి, బావ రాజిరెడ్డితో కలిసి స్వరాజ్యం పోరాటం కొనసాగించారు.
తన పాటలు, ప్రసంగాలతో అందరిని ఆకట్టుకునే వారు. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్వరాజ్యం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన గెరిల్లా దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు నిద్రలేకుండా చేశారు. రాజక్క పేరుతో దళాలను నిర్మించి నిజాం సర్కారును ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఆమె సొంతం. అప్పట్లో ఆమెను పట్టుకున్న వారికి రూ. 10 వేలు బహుమతి ఇస్తామని నిజాం సర్కారు ప్రకటించడం విశేషం.
సాయుధ పోరాటం అనంతరం జనజీవనంలోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తుంగతుర్తి నుంచి 1978, 1983లో సీపీఎం తరఫున గెలిచి ప్రజాసేవ చేశారు. తుంగతుర్తికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్ ఫండ్ కట్టనిదే కళాశాల మంజూరయ్యేదికాదు. కానీ ప్రభుత్వంతో కొట్టాడి కార్పస్ ఫండ్ కట్టకుండానే కళాశాల సాధించిన ఘనత ఆమెదే. తరువాత 1985,1989లో రెండు మార్లు ఎమ్మెల్యేగా, 1996లో మిర్యాలగూడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1994లో ప్రారంభమైన సారా వ్యతిరేక ఉద్యమానికి కూడా తనవంతు సహాయ సహకారాలు అందించారు. నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి సాగిన ఈ పోరాటంలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమాన్ని ఉరికించారు. నా మాటే తుపాకీ తూటా అనే పేరుతో తన జీవితకథను పుస్తక రూపంలో అచ్చు వేయించారు. చైతన్య మానవి సంపాదకవర్గంలో తనదైన ముద్ర వేశారు. చివరకు 91 ఏళ్ల వయసులో ఆమె కన్ను మూయడంతో అందరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.