Homeజాతీయ వార్తలుTelangana Agricultural Products: సాగు పండుగైంది.. దేశంలో తెలంగాణ నంబర్ 2

Telangana Agricultural Products: సాగు పండుగైంది.. దేశంలో తెలంగాణ నంబర్ 2

Telangana Agricultural Products: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న తెలంగాణ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రస్తుతం అగ్రస్థానానికి చేరుకుంది. దేశంలో నంబర్‌ 2 స్థానానికి చేరుకుంది. వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండోస్థానం తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. నాణ్యమైన, నమ్మకమైన ఉత్పాదకత, ఉత్పత్తుల తయారీ రంగంలోనూ ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఎదిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వ్యవసాయ రంగం – ఉత్పత్తుల ఎగుమతులు’ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అలాగే ఒకప్పుడు పెద్దగా జలవనరులు లేని రాష్ట్రం.. ఇప్పుడు అత్యధిక సాగునీటి పథకాలతో వర్ధిల్లుతోంది. ఈ క్రమంలో విస్తీర్ణం, వనరుల వినియోగంలో గడిచిన రెండు, మూడేళ్లలో భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులతో తెలంగాణకు ప్రత్యేక స్థానం దక్కింది.

రూ.10 వేల కోట్లకుపైగా ఎగుమతులు..
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి వ్యవసాయ ఎగుమతులు భారీగా పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల శాతం ఒక్కసారిగా 40 శాతానికి పెరిగి, రూ.10 వేల కోట్ల మార్కును దాటింది. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెంపు కోసం చేసిన ప్రయత్నాలు, రైతులకిస్తున్న ప్రోత్సాహకాలు ఫలించాయి. ఒకప్పుడు చితికిన బతుకులతో అల్లాడిన రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ఇంతలా సాగు పెరగడానికి రైతులు కూడా సాంకేతికత పద్ధతులను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వ్యవసాయ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదలను చూపించిన రెండు రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర. కేవలం ఐదేళ్లలో ఊహించని ప్రగతిని సాధించాయి. అదే సమయంలో వ్యాపార లావాదేవీలు 2017–18 నుంచి 2021–22 వరకు తెలంగాణలో రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెరిగాయి.

ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి..
వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల సానుకూల సంకేతాల కోసం వ్యవసాయ ఎగుమతుల్లో 2020 నుంచి 2022 మధ్యకాలంలో దాదాపు 40 శాతం పెరుగుదలను కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ గుర్తించింది. వ్యవసాయ ఎగుమతులు 2020–21లో రూ.6,337 కోట్లు ఉండగా, 2021–22లో దాదాపు రూ.10వేల కోట్లకు పెరిగినట్లు ధ్రువీకరించింది. తెలంగాణ ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, పత్తి, మాంసం తదితర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. వినూత్న పద్ధతులు, సాంకేతికతను వేగంగా ఉపయోగించడం, కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాల కారణంగా తెలంగాణ నుంచి ఎగుమతులు పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయ ఎగుమతుల లెక్కలవీ..
వ్యవసాయ ఆధారిత ఎగుమతుల్లో కేంద్ర గణాంకాల ప్రకారం, 2021–22లో పత్తి ఎగుమతులు మొత్తం రూ.3,055 కోట్లు కాగా, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీలు రూ.1,936 కోట్లుగా ఉన్నాయి. అలాగే తృణధాన్యాలు రూ.1,480 కోట్లు, మాంసం ఎగుమతులు రూ.268 కోట్లుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష, నిమ్మ, మామిడి, సోయాబీన్‌ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉందని గణాంకాల ప్రకారం తెలుస్తుంది. 2019–2021 మధ్యకాలంలో రాష్ట్రం రూ.3 వేల కోట్ల విలువైన ఎఫ్‌డీఐని ఆకర్షించింది. ప్రస్తుతం రాష్ట్రం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది, ఇది ఎగుమతి స్థానాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆర్థిక నిపుణులు. తెలంగాణ వచ్చిన తర్వాత .. సాధించిన కీలకమైనమార్పుల్లో ఇది ఒకటని ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular