
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే సమయానికే తెలంగాణలో ఇంటర్మీయట్ పరీక్షలు పూర్తయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ వాల్యుయేషన్ పనులు వాయిదా పడ్డాయి. తాజాగా రాష్ట్రంలోని లాక్డౌన్ సడలింపులు భారీగా ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ చేపట్టింది. ఈపాటికే ఇంటర్మీయట్ ఫలితాలు రావాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది. దీంతో ఇంటర్మీయట్ ఫలితాలను ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడనే చర్చ జరుగుతోంది.
కరోనా ఎఫెక్ట్ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటర్మీయట్ తర్వాత నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఏకంగా రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా పదోతరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. గతంలో నిర్వహించిన ప్రీపైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతి విద్యార్థులకు 80శాతం, అసైన్మెంట్, ఉత్తీర్ణత శాతం ఆధారంగా మరో 20శాతం మార్కులను వేయనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి విద్యార్థులంతా ప్రమోట్ కావడంతో ఇంటర్మీయట్ విద్యార్థుల పరిస్థితి ఏంటనే ప్రశ్న నెలకొంది. కరోనా కారణంగా ఆలస్యంగా పరీక్షల రిజల్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
ఈమేరకు ఇంటర్మీయట్ బోర్డు విద్యార్థుల రిజల్ట్ ప్రకటించేందుకు అన్ని సన్నహాలు చేస్తుంది. ఈనెల 15న ఫలితాలను విడుదల చేయాలని భావిస్తుంది. అయితే గతేడాది ఇంటర్ ఫలితాల విషయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలను తీసుకుంటోంది. ఫలితాలు ఒకటి రెండు తనిఖీ చేసి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ 15న ఫలితాలను ప్రకటించడం కుదరనట్లయితే 17న ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కాగానే విద్యార్థులు ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే ఏర్పాట్లను ఇంటర్మీయట్ బోర్డు చేస్తోంది. మార్కులకు సంబంధించి వెబ్ కాపీతోపాటుగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గ్రీటింగ్ మేసేజ్ పంపించేందుకు ‘దోస్త్’తో ఏర్పాట్లు చేస్తుంది. దీంతోపాటు ఇంటర్ ఫలితాలు ప్రకటించిన మరోసటి రోజునే డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వచ్చే నెలలో డిగ్రీ మొదటి దశ సీట్లను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.