Khammam NTR Statue: ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే వారి వాదనతో ఏకీభవించిన కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.
ఎందుకీ వివాదం
వాస్తవానికి లకారం చెరువులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది నిర్ణయించారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తే బాగుండేది. ఒక సామాజిక వర్గం మాత్రమే ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. పైగా మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సామాజిక వర్గానికి చెందిన నాయకులు దీనిని వారి కులానికి సంబంధించిన కార్యక్రమంగా మార్చుకున్నారు. పైకి అభిమానులు అనే ముసుగు ధరించినప్పటికీ లోపల రాజకీయ లెక్కలు వేరే ఉన్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ” సీనియర్ ఎన్టీఆర్ అంటే మాకు గౌరవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా కూడా ఒక భాగం. అంతేకానీ ఆయన కేవలం ఖమ్మం జిల్లాను మాత్రమే పాలించలేదు. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో అనుబంధం లేదు. కేవలం ఒక సామాజిక వర్గం తమ ప్రాపకం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా జలగం వెంగళరావు కు పేరు ఉంది. విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయనది మాత్రమే చేయాలి. అంతే తప్ప ఒక కులం ఓట్లను పొందేందుకు ఇలా విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని” ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది
వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఎప్పటినుంచో ఉన్నది కాదు. పైగా ఇటీవల ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్నికల్లో మంత్రి ప్రతిపాదించిన ప్యానల్ ఓడిపోయింది. దీంతో ఆయన తన సామాజిక వర్గం మీద పట్టు పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తన సామాజిక వర్గంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తులను కలిసి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిపాదనను ఆయన వారి ముందు ఉంచారు. దీనికి వారు సమ్మతం తెలిపారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. 54 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని లకారం చెరువులోని కేబుల్ బ్రిడ్జి మధ్యలో ప్రతిష్టించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. శత జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జూనియర్ ఎన్టీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
కోర్టు స్టే విధించింది
అయితే శ్రీకృష్ణుడి రూపంలో రూపొందించడం వివాదానికి కారణమైంది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారు అంటూ యాదవ సంఘాలు, ఇస్కాన్ మండిపడుతున్నాయి. అయితే దీనిపై వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా వారి వాదనతో ఏకీభవించి స్టే విధించింది. అయితే మొదటి నుంచి ఈ విగ్రహ ఏర్పాటును యాదవ సంఘం జాతీయ ప్రతినిధిగా కరాటే కళ్యాణి అడ్డుకుంటున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కళ్యాణి కోర్టుకు వెళ్లడంతో “మా” అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘన పై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు అఖిలభారత యాదవ సమితి కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించింది. మానవ విగ్రహాలు దేవుడి రూపంలో ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా రూపొందించారని, ఒక రాజకీయ పార్టీకి చెందిన మంత్రి ఇందులో కీలక పాత్ర పోషించడం ఏంటని యాదవ సంఘం ప్రశ్నించింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంతోమంది అభివృద్ధి పనులు చేశారని, వారి విగ్రహాలు కాకుండా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఒక సామాజిక వర్గం ఓట్లు గుంపగుత్తగా వేసుకునేందుకు అధికార పార్టీ పన్నిన పన్నాగం అంటూ యాదవ సంఘం ఆరోపించింది. హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఈ విగ్రహం ఎన్నాళ్లు అలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది