Liquor In Telangana: ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తొమ్మిదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం. తలసరి ఆదాయంలో తెలంగాణనే ఫస్ట్… దేశ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా తక్కువ’ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మైక్ పట్టుకుంటే లెక్కలతో సహా చెప్పే మాటలు ఇవి. ఇదంతా బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యం అయింది అంటూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇవి నిజమే అనుకుందాం. కానీ మరో విషయంలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అది కూడా బీఆర్‌ఎస్ ఘనతే. కానీ ఆ గొప్పదనాన్ని ఎప్పుడూ చెప్పుకోరు. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోరు. కానీ 100కు 200 శాతం ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్ సర్కార్‌కే ఇవ్వాలి.. ఇంత గొప్ప క్రెడిట్ ఏంటా అనుకుంటున్నారు… తాగుబోతుల తెలంగాణ గురించి.. నిజమే దేశంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మద్యం తాగేది తెలంగాణలో అని తేలింది. నంబర్ వన్ స్థానంలో మనేమే ఉన్నాం.
43.4 శాతం తాగుబోతులు..
తెలంగాణలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలంగాణ అత్యధికంగా 43.4 శాతం మంది మద్యం తాగుతున్నట్లు ప్రకటించింది. తర్వాత స్థానంలో 34.7 శాతంతో ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ ఉన్నాయి. పంజాబ్ 22. 8 శాతం ఆ తర్వాతి స్థానంలో ఉంది.
తక్కువ తాగేది గుజరాత్‌లో..
ఇక అత్యంత తక్కువ మద్యం తాగే రాష్ట్రం గుజరాత్‌గా సర్వేలో తేలింది. తర్వాత స్థానంలో జమ్ముకశ్మీర్ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి శాతం 5.8, 6 శాతంతో ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 14.5 శాతం, బిహార్ 15 శాతం మంది మద్యం తాగుతారని సర్వే తేల్చింది.
తాగుబోతుల తెలంగాణ..
దేశంలో అత్యధికంగా మందుబాబులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. 43.4 శాతం మంది తాగుబోతులయ్యారు. బంగారు తెలంగాణతోపాటు కేసీఆర్ పాలనలో రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా కూడా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇలా యువత తాగుడుకు బానిసవుతుంటే చదువులు అటకెక్కుతున్నాయి. ఉద్యోగాల ఆలోచన అడుగంటుతోంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, కబ్జాలు పెరుగుతున్నాయి. వీటికి కారణం మద్యపానమే. ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణ మద్యం పాలసీనే నేరాల పెగురుదలకు పరోక్షంగా కారణం. అయినా ఇంకా మద్యం షాపులు పెంచడం, ఇంకా ఎక్కువ మద్యం అమకాలు చేయడం, ఆదాయం పెంచుకోవడంపైనే కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెడుతోంది.