Telangana Gram Panchayat : ఇక పల్లెలన్నీ ‘ప్రత్యేక’ పాలన కిందికే

ఐదేళ్లలో రెండేళ్లు కరోనా కారణంగా శానిటేషన్‌ పేరిట గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయలేదు. బిల్లుల కోసం కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా స్పందించలేదు. దీంతో సర్పంచులు నిరాశగా పదవీ విరమణ చేశారు.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 10:23 pm
Follow us on

Telangana Gram Panchayath : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి పల్లె పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకూ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకూ తమనే సర్పంచులుగా కొనసాగించాలని ప్రస్తుత సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు. కానీ పదవీకాలం పొడగింపుపై ప్రభుత్వం స్పందించలేదు. సర్పంచుల సంఘం వినతిని పరిగణనలోకి తీసుకోలేదు.

దివాళా తీసిన సర్పంచులు..
తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికే ఒక్కో పంచాయతీకి లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అభివృద్ధి పనులు చేయాలని ఒత్తిడి చేయడం, పనులు చేయకుంటే పదవి పోతుందని బెదిరించడంతో చాలా మంది సర్పంచులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేశారు. కొందరు అప్పులు తెచ్చి మరీ పనులు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తమ పదవీకాలం పొడిగించాలని సర్పంచులు కోరారు. లేదంటే పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతనే స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలన్నారు. కానీ ప్రభుత్వ ప్రత్యేక పాలనకే మొగ్గు చూపింది.

ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు..
పదవీకాలం ముగియనున్న సమయంలో ప్రభుత్వం పెండింగ్‌ పనులు పూర్తి చేస్తేనే బిల్లులు వస్తాయని తెలిపింది. దీంతో పది రోజులుగా సర్పంచులు పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటికలు, పంచాయతీ భవన నిర్మాణాలు, పల్లె ప్రకృతివనాల పనులు పూర్తి చేయించారు. దీంతో సర్పంచులు మరింత అప్పులపాలయ్యారు. కానీ, బిల్లులు రాకుండానే పదవీకాలం పూర్తి కావడంతో ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం తీరుతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఐదేళ్లలో రెండేళ్లు కరోనా కారణంగా శానిటేషన్‌ పేరిట గత ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయలేదు. బిల్లుల కోసం కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా స్పందించలేదు. దీంతో సర్పంచులు నిరాశగా పదవీ విరమణ చేశారు.

ప్రత్యేక అధికారులు..
పంచాయతీల ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేసింది, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలుతోపాటు గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్లను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఫిబ్రవరి 2న బాధ్యతలు తీసుకుంటారని సమాచారం.