Minister KTR: అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు. ఇక్కడ తిట్టడం ఎందుకు అక్కడకు వెళ్లి బతిమాలడం ఎందుకు? అన్నట్లుగా టీఆర్ఎస్ నేతల పరిస్థితి తయారయింది. రాష్ర్టంలో మాత్రం గాంభీర్యం ప్రకటిస్తూ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల వద్ద అపాయింట్ మెంట్ల కోసం మోకరిల్లుతున్నారు. వారి దర్శన భాగ్యం కోసం తరిస్తున్నారు. ఇదంతా రైతుల కోసమే చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఇక్కడ బీజేపీపై విమర్శలు చేస్తూ అక్కడ మర్యాదలు నటిస్తూ వారిలో కూడా గొప్ప నటులు దాగి ఉన్నారని రుజువు చేస్తున్నారు.
Also Read: కేసీఆర్.. నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారా?

ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట బీజేపీ నేతలపై కారాలు మిరియాలు నూరిన నేతలు ప్రస్తుతం ఢిల్లీలో వారి ప్రాపకం కోసం పాకులాడటం తెలిసిందే. దీంతో అవసరమైతే కాళ్లు అవసరం తీరితే రాళ్లు అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు తొలగించుకోవాలని రాష్ర్ట టీఆర్ఎస్ నేతలు చూస్తున్నా కేంద్ర మంత్రులు మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది. దీనిపై నేతల్లో అయోమయం నెలకొంది.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవడానికి మన రాష్ర్ట మంత్రులు గంటల తరబడి వేచి చూశారు. ఎట్టకేలకు మూడు నాలుగు గంటల తరువాత రావడంతో భేటీ కొనసాగించారు. కానీ బియ్యం విషయంలో మాత్రం ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో నేతల్లో ఆందోళన పట్టుకుంది. ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చినా ఫలితం దక్కలేదని వాపోతున్నట్లు తెలిసింది. రాష్ర్ట సమస్యలను సావధానంగా విన్న కేంద్ర మంత్రులు తరుణోపాయాలు మాత్రం సూచించలేదు.
వానకాలం, యాసంగిలకు వేర్వేరుగా ధాన్యం కొనుగోలు లక్ష్యాలు ఉండొద్దని కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో రైతుల సమస్యలు తీరే మార్గం కనిపించడం లేదు. రాష్ర్ట మంత్రులు కేంద్ర మంత్రుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ కనుచూపు మేరలో పరిష్కారం మాత్రం కానరావడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలులో తిప్పలు యథాతథంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Also Read: వరి ఎఫెక్ట్: ఢిల్లీలో కేసీఆర్ కు షాకుల మీద షాకులు