https://oktelugu.com/

Corona Treatment in Aarogyasri: ఎట్టకేలకు తెలంగాణ మేలుకుంది… ఆరోగ్యశ్రీలోకి కరోనా

Corona Treatment in Aarogyasri: కరోనా వైరస్(corona) తో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ వైరస్ సోకిన వారికి సరైన చికిత్స అందక చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఇళ్లు గుల్ల చేసుకున్నారు. లక్షలు.. కొట్టు ఖర్చుపెట్టినా ఒక్కోసారి ప్రాణాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేదవారికి కరోనా చికిత్సను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించేందుకు కొవిడ్ ను ఆరోగ్య శ్రీ(Aarogyasri)లో చేర్చాలని గత సంవత్సర కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 30, 2021 / 10:25 AM IST
    Follow us on

    Corona Treatment in Aarogyasri: కరోనా వైరస్(corona) తో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ వైరస్ సోకిన వారికి సరైన చికిత్స అందక చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఇళ్లు గుల్ల చేసుకున్నారు. లక్షలు.. కొట్టు ఖర్చుపెట్టినా ఒక్కోసారి ప్రాణాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేదవారికి కరోనా చికిత్సను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించేందుకు కొవిడ్ ను ఆరోగ్య శ్రీ(Aarogyasri)లో చేర్చాలని గత సంవత్సర కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకాముందు ఆలోచించింది. మొత్తానికి తాజాగా కరోనా చికిత్సను చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి నిర్ణయం తీసుకుంది. ప్రజలకు థర్డ్ వేవ్ ముంగిట గొప్ప వరాన్ని ఇచ్చింది. కేసీఆర్ సర్కార్ లేటుగా అయినా ప్రజా ఉపయోగ నిర్ణయాన్ని తీసుకుంది.

    కరోనా రెండు వేవ్ లతో దేశం మొత్తం అల్లకల్లోలమైంది. ఫస్ట్ వేవ్లో లాక్డౌన్లతో చాలా జాగ్రత్తలు తీసుకున్నా…సెకండ్ వేవ్ ను ఎవరూ అంచనా వేయలేకపోయారు. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఈ సమయంలో కొందరు కార్పొరేట్ ఆసుపత్రులు చుట్టూ తిరిగారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ఆసుపత్రులు కరోనా చికిత్సనందించి అధిక బిల్లులు వసూలు చేశాయి. కొందరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. అధిక బిల్లుల వసూళ్లపై కొందరు ఆందోళన చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నా.. కొందరు మాత్రం వారిపని వారు చేశారు.

    ఇక సామాన్యుల పరిస్థితి సరేసరి. ఆసుపత్రుల్లో చేరిన తరువాత బిల్లు కట్టని వారికి మృతదేహాన్ని కూడా అప్పగించని సంఘటనలూ ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య అందుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో ప్రవేశపెట్టింది. తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ‘ఆరోగ్యశ్రీ +ఆయుష్మాన్ భారత్’ పేరుతో చికిత్స అందించనున్నారు.

    తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉచిత చికిత్సల సంఖ్య 1,668కి చేరింది. వీటిలో 642 చికిత్సలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం అందించనున్నారు. ఇక ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 50 పడకలున్న ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం అందించేవారు. ఇప్పుడు 6 పడకలున్న పీహెచ్ సీల్లోనూ చికిత్స చేయనున్నారు.ఆయుష్మాన్ భారత్ పథకంలో అన్ని చికిత్సలకూ రూ. 5 లక్షల వరకూ గరిష్ట పరిమితి ఉంటుంది. ఆరోగ్య శ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా రూ. 2 లక్షలు వర్తిస్తుంది. దీంతో ఈ కార్డు కలిగిన పేదలు కార్పొరేట్ ఆసుపత్రల్లో చికిత్స చేయించుకోనున్నారు.

    ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు డెంగీ , మలేరియా, చికెన్ గున్యా వంటి వాటికి చికిత్స అందించారు. అలాగే పాముకాటు అర్థరైటిస్, అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్, వడదెబ్బ, కుక్క కాటు నిమోనియా లాంటి చికిత్స చేయించుకేనే అవకాశం ఉంది. ఇప్పుడు వీటితో పాటు కరోనా చికిత్స కూడా చేయనున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రజలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా అక్కడ ‘ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్’ కార్డు ద్వారా చికిత్స పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డులోలేని జబ్బు వచ్చినా అప్పటి కప్పుడు ఈ పథకం కార్యనిర్వాహణాధికారితో మాట్లాడి చికిత్స పొందవచ్చు. అలాంటి వ్యాధులకు రూ. లక్ష వరకు సాయం పొందుతారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని తెలంగాణలో ఎప్పటినుంచో డిమాండ్లు వస్తున్నాయి. అయితే త్వరలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.