తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎవ్వరికీ కనిపించని స్నేహ బంధం కొనసాగుతోందా? కేసీఆర్ జగన్ మధ్య సఖ్యత కొనసాగుతూనే ఉందా? బయటకు కనిపిస్తున్న పంచాయితీలో నిజం లేదా? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మభ్యపెట్టేందుకే రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీని తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. వెలుగు చూసిన ఓ విషయం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న దశరథ రామిరెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఏపీ సర్కారు చేసిన అభ్యర్థనను తెలంగాణ మన్నించింది. అంతర్ రాష్ట్ర డిప్యుటేషన్ విధానాన్ని ఉపయోగించి మరీ.. ఆయనకు బాధ్యతలు అప్పగించడం గమనించాల్సిన అంశం. దీంతో.. ఇప్పుడు ఈ అంశం రెండు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది.
తెలంగాణలో పనిచేస్తున్న అధికారి ఏరికోరి సజ్జల దగ్గరే పనిచేయాలని కోరడమేంటీ? ఆయనను డిప్యూటేషన్ పై పంపించాలని ఏపీ సర్కారు స్వయంగా.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమేంటీ? తెలంగాణ సర్కారు దాన్ని ఆమోదించడమేంటీ? అని రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయితీ అంశం కూడా తెరపైకి వస్తోంది.
ఈ ఓఎస్డీ అంశంతో.. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహం కొనసాగుతూనే ఉందని తేలిపోయిందని అంటున్నారు. ఇద్దరు సీఎంల మధ్య ప్రేమలు, ఆప్యాయతలూ చూస్తుంటే.. ప్రజలకు ఎంతో ముచ్చటేస్తోందని సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో సహకారాలు అందించుకోవచ్చుగానీ.. నీటి పంచాయితీ విషయంలో మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోరా? అని ప్రశ్నిస్తున్నారు ఇది నిజంగానే రాజకీయ డ్రామా కాక మరేమిటి? అని నిలదీస్తున్నారు. మరి, దీనిపై కేసీఆర్, జగన్ ఏమంటారో?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana govt accepted andhra pradesh plea for osd appointment
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com