Kasoju Shankaramma MLC: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్సీ కాబోతోందా అంటే అవుననే అంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. శ్రీకాంతాచారి త్యాగం ఎట్టకేలకు కేసీఆర్‌కు గుర్తొచ్చింది. దీంతో వెంటనే అమరుడి తల్లిని ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించాడని తెలుస్తోంది. ఈమేరకు శంకరమ్మకు కబురు కూడా పంపించారని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు బీఆర్‌ఎస్ భవన్‌లో చర్చ జరుగుతోంది.
ఖాళీగా రెండు ఎమ్మెల్సీ పదవులు..
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సాధారణంగా అవి ఖాళీ అయ్యే నాటికి భర్తీ చేస్తారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంకా భర్తీ చేయలేదు. గవర్నర్‌కు ఎలాంటి సిఫార్సులు పంపలేదు. గతంలో హుజూర్‌నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు.
దశాబ్ది వేడుకల ముగింపు వేళ..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు. గురువారం అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అమరులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాంగా ఆరోపణలు వస్తున్నాయి . వీటిని తిప్పికొట్టేందుకు శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తే సరిపోతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు బీఆర్‌ఎస్‌లో చాలా మంది సీనియర్లు.. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చూస్తున్నారు. ఒక సీటు అనూహ్యంగా శంకరమ్మకు కటాయించడంతో కేసీఆర్ రాజకీయంగా ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
ఒక్క పదవితో వ్యతిరేకత పోయేనా..
ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గొగలి పురుగును అయినా కౌగిలించుకుంటానన్న కేసీఆర్… హోదాతో సంబంధం లేకుండా చిన్న చితక నేతలను కలిశారు. ఉద్యమం కోసం అందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. తాను. తన కుటుంబం వెనకాల ఉండి ఉద్యమకారులను ఎగదోసింది. ఈ క్రమంలో 1200 మంది అమరులయ్యారు. ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది తెలంగాణ వచ్చిన తర్వాత కనుమరుగయ్యా. మిలియన్ మార్చ్‌ను విజయవంతంగా నిర్వహించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో పనిచేసిన అనేక మంది తర్వాత కేసీఆర్ తీరుతో పార్టీని వీడారు. కేసీఆర్.. మాత్రం ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని అందలం ఎక్కించారు. ప్రస్తుత మంత్రివర్గంలోనూ ఉద్యమ వ్యతిరేకులు ఆరుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు కేసీఆర్. ఎన్నికల వేళ ఇదే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో తాజాగా ఉద్యమకారులకు పదవులు ఆశ చూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి శంకరమ్మకు పదవి ఇచ్చినంత మాత్రాన ఉద్యగకారులను గౌరవించినట్లేనా అంటే దానికి కాలమే సమాధానం చెబుతుంది.