
Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాలని భావించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ఆ అవకాశం దక్కకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ విక్రయానికి సంబంధించి నిర్వహించే బిడ్ లో పాల్గొంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కూడిన బృందాన్ని స్టీల్ ప్లాంట్ కు పంపించింది. దీంతో తెలంగాణ సర్కార్ ఈ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తుందని ఇక్కడ కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారయింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ పరిస్థితి.
ప్రైవేటీకరణ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్లడం లేదంటూ ఓ కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై స్పందించిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. కెసిఆర్ దెబ్బకు కేంద్రం అబ్బా అన్నదని గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కనీసం బిడ్ లో కూడా పాల్గొనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న బిఆర్ఎస్ కు ఇక్కడ పరిస్థితులు పెద్దగా అనుకూలించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకి బిడ్ ఎందుకు వేయలేదని తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రశ్నిస్తున్నారు. ముందు గొప్పలు చెప్పి.. సమయం దాటిపోతున్న బిడ్ వేయకుండా ఎందుకు మోసం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీలో బహిరంగ సభ పెట్టాలనుకున్న బిఆర్ఎస్ పార్టీకి ఆదిలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనట్లు చెబుతున్నారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పునరాలోచించాల్సిన పరిస్థితి..
స్టీల్ ప్లాంట్ విషయంలో ముందు నుంచి అంకితభావంతో పోరాటం చేస్తున్నారు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు ఆయన. కెసిఆర్ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని ప్రకటించినప్పుడు బలంగా ఆయనను సమర్థించారు మాజీ జెడి లక్ష్మీనారాయణ. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ ను పార్టీలోకి తీసుకురావాలని భావించారు కేసీఆర్. ఆయనతో చర్చలు కూడా జరిపారు. అయితే, బిఆర్ఎస్ కు ఏపీలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా లక్ష్మీనారాయణ పునరాలోచన చేసినట్టు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉపయోగపడుతుందనెలా పరిస్థితులు ఏర్పడ్డాయి. బిడ్ వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు మొదట లక్ష్మీనారాయణ కేసీఆర్ ను పొగిడారు. కానీ ఇప్పుడు బిడ్ వేయకపోవడంతో ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరికపై ఆలోచించాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి.

విస్తరణపై దృష్టి సారించని బిఆర్ఎస్..
దేశ వ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని బిఆర్ఎస్ గా మార్పు చేసిన సమయంలో కేసీఆర్ గొప్పగా చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడంపై ఆ పార్టీ అగ్ర నాయకులు దృష్టి సారించలేదు. మహారాష్ట్రలో మాత్రం వరుసగా మూడు సభలు పెడుతున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలను మాత్రం బిఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఉన్న కర్ణాటక పై అసలు దృష్టి పెట్టలేదు ఆ పార్టీ నాయకులు. ఏపీ, ఒడిశాలకు ఇన్చార్జిలను నియమించినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఏపీలో అడుగుపెట్టడానికి ఉన్న ఒక్కగానొక్క అవకాశాన్ని టిఆర్ఎస్ నాయకులు వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏపీలో అడుగు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ఏమీ కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యను ఉపయోగించుకుంటే ఎక్కువ మంది పార్టీలో చేరే అవకాశం ఉండేదని, ఇప్పుడు బిడ్ లో పాల్గొనకపోవడం వలన ఆసక్తి ఉన్నవారు కూడా ముందుకు రాకపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.