Homeజాతీయ వార్తలుManoharabad Kothapalli Railway Line: తెలంగాణలో రోడ్డు కం రైలు వంతెన.. ఎక్కడ నిర్మిస్తారో తెలుసా?

Manoharabad Kothapalli Railway Line: తెలంగాణలో రోడ్డు కం రైలు వంతెన.. ఎక్కడ నిర్మిస్తారో తెలుసా?

Manoharabad Kothapalli Railway Line: రోడ్డు కం రైలు వంతెన అనగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గుర్తొచ్చేది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వంతెన, రాజమండ్రి దగ్గర గోదావరిపై నిర్మించిన బ్రిడ్జి గుర్తొస్తుంది. ఆ బ్రిడ్జిపై రైలులో ప్రయాణించగం అందరికీ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి రోడ్‌ కం రైలు బ్రిడ్జి రాబోతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనను రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లింది.

ఎక్కడ నిర్మిస్తారంటే..
హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే ఈ కొత్త రైలు మార్గంలో ఒక రోడ్‌ కం రైలు వంతెనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌ మార్గంలో మిడ్‌ మానేరుపై వేములవాడ సమీపంలో ఈ రోడ్‌ కం రైలు మార్గం వచ్చేలా ఆలోచన చేస్తున్నారు.

సిద్దిపేట వరకు ట్రాక్‌ నిర్మాణం పూర్తి..
ఇప్పటికే గజ్వేల్‌ నుంచి సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్‌ పూర్తయింది. అప్పుడప్పుడు గూడ్స్‌ రైళ్లు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇక సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కొత్తపల్లి వరకు నిర్మించబోయే రైలు మార్గం కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. తొలుత ఇక్కడ కేవలం రైలు వంతెన మాత్రమే నిర్మించాలని భావించారు. కానీ, ఇటీవల జరిగిన సన్నాహక చర్చలో.. మిడ్‌ మానేరుపై రోడ్‌ కం రైలు వంతెన కూడా ఉంటే బాగుంటుందని నిర్ణయించారు.

సీఎం దృష్టికి ప్రతిపాదన..
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ రోడ్‌ కం రైలు వంతెన ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేసీఆర్‌ అంగీకారం తెలియజేయడంతో.. సదరు ప్రతిపాదనను రైల్వే అధికారులకు తెలియజేశారు. దాదాపు కిలోమీటర్‌ పొడవైన రోడ్డు రైలు వంతెన తంగెళ్లపల్లి మండలంలో ప్రారంభమై వేములవాడలో ముగిసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

అంచనా వ్యయం రూ.1,981.64 కోట్లు..
కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైలు మార్గాన్ని రైల్వే శాఖ అత్యంత కీలకంగా భావిస్తోంది. 151.36 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం కోసం రూ.1,981.64 కోట్ల వ్యయం అవుతుందదని అంచనా వేసింది. ఇందులో మూడింట ఒక వంతు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వనున్నది. భూసేకరణ, మౌలిక సౌకర్యాల బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ రైలు మార్గం నిర్మించిన తర్వాత నష్టాలు వస్తే.. తొలి ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని భరించేలా ఒప్పందం చేసుకున్నారు.

కీలక మార్గంలో ఇలా..
కీలకమైన మనోహరాబాద్‌ కొత్తపల్లి రైలు మార్గంలో 13 స్టేషన్లు ఉండనున్నాయి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌ను మార్గంతో కలుపుతారు. ఈ మార్గంలో 21 భారీ బ్రిడ్జిలు, 159 మైనర్‌ బ్రిడ్జిలు, 7 ఆర్వోబీలు, 49 ఆర్‌యూబీల రానున్నాయి. 2025 కల్లా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రైల్వే శాఖ ఆమోదమే తరువాయి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న రైల్వేలైన్‌ మార్గంలో రోడ్‌ కం రైల్‌ వంతెనకు రైల్వే శాఖ ఆమోదం తెలుపాల్సి ఉంది. రెండు ప్రభుత్వాల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఉండని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే శాఖ ఆమోదం తెలుపగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version