Telangana Formation Day 2023: తెలంగాణ ఉద్యమం చరిత్ర చాలా గొప్పది. కేవలం కేసీఆర్ మాత్రమే ఈ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోలేదు. రెండు దశలో జరిగిన ఈ ఉద్యమంలో ఎంతోమంది అసువులు బాసారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. నేటికీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ అటుకులు బుక్కి, పస్తులున్నవారు, తెలంగాణ కలలు సహకారం చేసి వారు మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇక ఉద్యమకారులపై కర్రలు ఎత్తి దాడులు చేసిన వారు, రాళ్లు విసిరి గాయపరచిన వారు నేడు ప్రభుత్వ పాలనలో కీలకమయ్యారు. పలు స్థానాల్లో ఆసీనులయ్యారు. ఉద్యమ నాయకుడిగా చెప్పుకుంటున్న కేసీఆర్, ఉద్యమంలో తన వెంట నడిచిన వారిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు.
అన్ని వర్గాల పోరాటంతోనే
అన్ని పార్టీలు, వర్గాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇది ఒక్కరి ఘనత అంటే తెలంగాణ ఉద్యమాన్ని చిన్నచూపు చూసినట్టయితే అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. పదో ఏడాదిలో తెలంగాణ అడుగుపెడుతోంది. తెలంగాణ వెలిగిపోతోంది అంటూ ప్రభుత్వం ఆర్భాటం ప్రదర్శిస్తోంది. తెలంగాణ దశాబ్ది పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. నిజానికి, ఎవరైనా పదేళ్లు పూర్తయిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తారు. పదవియట అడుగుపెట్టినప్పుడు ఉత్సవాలకు శ్రీకారం చుట్టినప్పటికీ… పది సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఘనంగా నిర్వహిస్తారు. భారత అమృతోత్సవాలు, పీవీ శత జయంతి వేడుకలు ఇదే బాటన సాగాయి. కానీ ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి, మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం రాజకీయ కోణాన్ని మాత్రమే ఇందులో చూసింది. అందుకే నవాబ్దిలోనూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది..
వారు ఏరి
తెలంగాణ ఉద్యమం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ప్రొఫెసర్ జయశంకర్, శాంతియుతంగా, అద్భుత సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం. విద్యుత్ రంగంలోని లోపాలను ఎత్తి చూపిన విద్యుత్ జేఏసీ రఘు. జయ జయహే తెలంగాణ అంటూ నినదించిన అందెశ్రీ. నాన్ ముల్కీ నుంచి తెలంగాణ సాధన వరకు కీలక పాత్ర పోషించిన కేశవరావు జాదవ్. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన శ్రీకాంతా చారి. తెలంగాణ ఉద్యమ నినాదాలతో ప్రతిరోజు దద్దరిల్లిన ఉస్మానియా యూనివర్సిటీ, ధర్నా చౌక్.. ఉద్యమానికి ఊపిరిలు ఊదిన ప్రజా సంఘాలు.. ఇప్పుడు వీరు ఎవరికైనా గుర్తున్నారా? కనీసం వీరి పేర్లైనా వినిపిస్తున్నాయా? ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాటి తెలంగాణ ఉద్యమం గుర్తులు కనిపిస్తున్నాయా. అసలు ఇప్పుడు ఉద్యమాలు.. ఉద్యమ నేతలు లేరు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత ఉక్కు పాదం మోపడమే రివాజు గా మారింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గొంతు ఎత్తి నినదించడమే మహా పాపమైంది.
ఉద్యమకారులు కనుమరుగు
మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె ను శాంతియుతంగా నడిపించడంలో కోదండరాం కీలకపాత్ర పోషించారు. 2009 డిసెంబర్ తర్వాత ఉద్యమం మొత్తం ఆయన నేతృత్వంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన నాయకత్వాన్ని అందరూ విశ్వసించారు. కానీ అలాంటి కోదండరామ్ ను తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే ప్రభుత్వం దూరం పెట్టింది. ఇవాల్టికి ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. చివరికి ఉద్యమకారులపై దాడులు చేసిన వారంతా అధికార పార్టీలో చేరి కోదండరామను విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వేధింపులు ఎదుర్కొంటున్న మరొక ఉద్యమకారుడు విద్యుత్ అధికారి రఘు. ఇతను ఇచ్చిన సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని నాడు కెసిఆర్ పలు సందర్భాల్లో మాట్లాడాడు. అలాంటి విద్యుత్ అధికారి రఘు ప్రభుత్వ విధానంలో తప్పులను ఎత్తిచూపుతున్నందుకు నరకం చూపిస్తోంది. హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్న ఆయనను తోడుత వరంగల్ బదిలీ చేసిన ప్రభుత్వం.. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా అనివార్యంగా అందరూ ఉద్యోగులతో పాటే ఆయనకు చీఫ్ ఇంజనీర్ గా పదోన్నతి ఇవ్వగా.. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వంకతో రాష్ట్రంలో మరే ఉద్యోగికి లేనివిధంగా సర్వీస్ సీనియార్టీ సిద్ధం చేయాలని కారణం చూపించి.. ఏకంగా రెండు క్యాడర్ల పదోన్నతులను ఆయన నుంచి దూరం చేసింది. అయితే తరహాలో ఉద్యమానికి వెన్నెముక ఆయన ఈటెల రాజేందర్ ను కూడా అధికార పార్టీ ఇదే విధంగా టార్గెట్ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన తన ఉద్యమ పంథా ను మానుకోలేదు. గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు నచ్చకపోవడంతో ప్రభుత్వం నుంచి పంపించాడు. ఆయన వ్యాపారాలపై రకరకాల దాడులు చేయించాడు.
వారి గుర్తులు గాయబ్
ఇక ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణమైన ప్రొఫెసర్ జయశంకర్ కు కూడా తెలంగాణ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. వ్యవసాయ యూనివర్సిటీ, జిల్లాకు తప్పితే తెలంగాణ సిద్ధాంతకర్తకు తగిన గుర్తింపు దక్కలేదు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత గుర్తింపు లభించకుండా పోయినవారు జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ అధ్యాపకుడు కేశవరావు జాదవ్ కూడా ఒకరు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన ఆయన.. 1956లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 2001లో టిఆర్ఎస్ ఏర్పాటు పోషించారు. 2009 నుంచి 13 దాకా జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2018లో జాదవ్ అనారోగ్యంతో కన్నుమూస్తే.. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. ఇక తెలంగాణ ఏర్పాటులో 2009 డిసెంబర్లో రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన కాసోజు శ్రీకాంతాచారి పాత్ర అత్యంత కీలకం.. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత ఎల్బీనగర్ చౌరస్తాకు ఆయన పేరు పెట్టారు. అంతే తప్పితే అతనికి దక్కిన గుర్తింపు ఏమీ లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన తల్లి శంకరమ్మ పేరును పరోక్ష ఎన్నికల్లో గాని, నామినేటెడ్ పోస్టుల్లో గాని కెసిఆర్ పరిగణలోకి తీసుకోలేదు. ఇక మంజీరా రచయితల సంఘం కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఆ సంఘానికి నేతృత్వం వహించిన నందిని సిధారెడ్డి తెలంగాణ ఏర్పాటయిన తర్వాత సాహిత్య అకాడమీ బాధ్యతలు పర్యవేక్షించారు. తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఆయన క్రమంగా దూరమయ్యారు. జయ జయహే తెలంగాణ అందెశ్రీకి కూడా సరైన గుర్తింపు లభించలేదు. విమలక్క, గద్దర్, గాదె ఇన్నయ్య లాంటి ఉద్యమకారుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రజాసంఘాలను కూడా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేసింది. ఏకంగా 16 సంఘాలపై నిషేధం విధించింది. ఇక ఉద్యమానికి కేంద్ర బిందువయిన ఉస్మానియా యూనివర్సిటీని 9 సంవత్సరాల లో ఒక్క మంత్రి కూడా సందర్శించలేదు. ప్రత్యేక డ్రైవ్ ల పేరుతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థి సంఘం నాయకులను బయటకు వెళ్లగొట్టింది. వారిపై కేసులు నమోదు చేసింది. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ధర్నా చౌక్ కు కూడా ప్రభుత్వం చరమగీతం పాడింది. ధర్నా చౌక్ లో నిరసనలు నిషేధించింది. హైదరాబాద్ శివారు లో నిరసనలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.