రెండు తెలుగు స్టేట్లలో నదీ జలాల విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా నదీ జలాల విషయంలో ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ పరస్పరం దాడులకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 13న జరిగే ఈ సమావేశంలో జల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
కృష్ణా జలాల్లో సగం వాటా వస్తుందని కేసీఆర్ వాదిస్తున్నారు. చంద్రబాబు హయాంలో 299 టీఎంసీలకే అంగీకారం తెలిపినా ఇప్పుడు అది చెల్లదని చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేఆర్ఎంబీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. నదీ జలాల వినియోగంపై వెనక్కి తగ్గకుండా పోరాడేందుకు నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.
కృష్ణా నదీ జల వివాదం రెండు ప్రాంతాల్లో పరిష్కరించలేని సమస్యగా మారింది. నీటి వాడకం, విద్యుత్ తయారు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేబినెట్ సమావేశంలో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోనున్నారనే దానిపైనే ఆసక్తి నెలకొంది. న్యాయస్థానాలనుంచి ఎలాంటి తీర్పు వచ్చినా, కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ చెబుతోంది.
ఇప్పటికే 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం చేసిన విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేస్తుండడంతో దీనిపై ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ ఒప్పందాన్నిరద్దు చేసుకుని కృష్ణా బోర్డుకు సమాచారం పంపాలని నిర్ణయించుకుంది. తెగని పంచాయతీగా మారిన కృష్ణా బోర్డు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
ఇప్పుడు రెండు స్టేట్ల వ్యవహారంలో ఇరు పార్టీల సీఎంలు, నేతలు కూడా పరస్పరం దూషణలకు దిగుతున్నారు. వాటాల విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు సైతం తమ నోళ్లకు పని చెబుతున్నారు. అప్పుడు చేసుకున్న ఒప్పందాన్ని మళ్లీ మార్చాలని చూడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నదీ జలాల వినియోగంలో మాకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాదిస్తోంది.