Telangana Current Bills
Telangana Current Bills: మీరు వాడుకున్న కరెంటుకు బిల్లు చెల్లించడం అనేది ఒక పద్ధతి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు వాడకున్నప్పటికీ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినడానికి ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. త్వరలో రాష్ట్రంలో అమలయ్యేది ఇదే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి అవసరం లేని విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు భారీ ఎత్తున చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు… వచ్చే ఏడాది నుంచి ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో భారీ ఎత్తున మిగులు విద్యుత్ ఉండనుందని, వినియోగించుకోని విద్యుత్‌కు ప్రజలు పెద్ద మొత్తంలో స్థిర చార్జీలు (ఫిక్స్‌డ్ చార్జీలు) చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాలను బ్యాంకింగ్ డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించుకోవడం, పూర్తిగా నిలుపుదల చేయడం తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు తమ వాదనలను తెలియజేశారు.
ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం..
2024-29, 2029-34 మధ్య కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అంచనాలు, విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలు, పెట్టుబడి, వనరులు, వ్యాపార అవకాశాలపై ఇటీవల రాష్ట్ర డిస్కంలు ఈఆర్సీకి ప్రణాళికలను సమర్పించాయి. దీనిపై ఈఆర్సీ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించి శుక్రవారం విచారణ జరిపింది. ఈ మేరకు సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తదితరులు ఈఆర్సీకి రాతపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేశారు. ఈ వివరాలు ఈఆర్సీ వెబ్‌సైట్‌లో ఆదివారం వెల్లడయ్యాయి. తమ ప్రతిపాదనల్లో డిస్కంలు పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్‌ను చూపాయని, దీంతో భవిష్యత్తులో విద్యుత్ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడబోతోందని ఎం.వేణుగోపాల్ రావు తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. 2024-25లో 43.24 శాతం, 2025-26లో 41.97 శాతం, 2026-27లో 34.13 శాతం, 2027-28లో 26.29 శాతం, 2028-29లో 15.22 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని తెలిపారు. ముందుచూపు లేకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారబోతున్నాయని ఆక్షేపించారు. అవసరం లేని విద్యుత్ కోసం చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలకు ఈఆర్సీ అనుమతి ఉన్నా ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. రానున్న సంవత్సరాల్లో మిగులు విద్యుత్ స్థిరంగా ఉండదన్న డిస్కంల వాదనలో పసలేదని, వినియోగదారులపై అది స్థిరచార్జీల భారాన్ని నివారించదని తెలిపారు. కొత్త ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలు ఏటేటా క్రమంగా పెరగనున్నాయని, మిగులు విద్యుత్ సమస్యే ఉండదని డిస్కంలు సమర్థించుకోవడాన్ని కొట్టివేశారు. ఎత్తిపోతల పథకాలకు ఎంత విద్యుత్ అవసరమో డిస్కంలు ప్రతిపాదించలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుమతులు జారీ చేసే ముందు ఈఆర్సీ సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు.
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు ఎంత?
వ్యవసాయం మినహా అన్ని కేటగిరీల కనెక్షన్లకు 2025 నుంచి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలని కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు డిస్కంలు ఈఆర్సీకి తమ వనరుల ప్రణాళికలో వెల్లడించాయి. 2024-29 మధ్య కాలంలో ఎల్టీ మీటర్ల ప్రీపెయిడ్ మీటర్లకు రూ.348 కోట్లు, హెచ్‌టీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు రూ.305 కోట్లు అవసరమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ( టీఎస్పీసీఎల్) నివేదించింది. ఎల్టీ మీటర్లకు రూ.116 కోట్లు, హెచ్‌టీ మీటర్లకు రూ.10.94 కోట్లు అవసరమని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని వేణుగోపాల్‌రావు ప్రస్తావిస్తూ.. ఈ మీటర్ల ధర ఎంత? ఏ విధంగా ఈ ధరలను ఖరారు చేశారో తెలపాలని డిస్కంలను ప్రశ్నించారు. కాగా, వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి డిస్కంలు సమర్పించిన కీలకమైన వనరులు, వ్యాపార ప్రణాళికలపై ఈఆర్సీ ఈ నెల 22న రెండోసారి బహిరంగ విచారణ జరపనుంది. గత శుక్రవారం ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణకు సరైన సమాచారంతో డిస్కంలు రాకపోవడంతో.. పలువురు నిపుణులు చేసిన విజ్ఞప్తి మేరకు మరోసారి విచారణ జరపాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఈలోగా పూర్తి వివరాలను సమర్పించాలని డిస్కంలను ఆదేశించినట్టు తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana electricity department charges extra while issuing current bills
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com