Telangana Elections 2023
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్‌తో వామపక్షాలు జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ – జనసేన సీట్ల షేరింగ్ చివరి దశకు వచ్చింది. ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో ఈసారి త్రిముఖపోరు అన్న విషయం అర్థమవుతోంది. అయితే మెజారిటీ స్థానాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో అధికారం ఎవరిదో ఆ జిల్లా తేల్చబోతుంది. అక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవి ఏయే జిల్లాలో చూద్దాం..
ఖమ్మంలో మారుతున్న లెక్కలు…
ఖమ్మం తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీకి గుమ్మం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. తెలంగాణ రాజకీయం ఒక ఎత్తు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఖమ్మం జిల్లా రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి. 2014, 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హవా కొనసాగినా, ఈ జిల్లాలో మాత్రం పట్టు చిక్కలేదు. పది అసెంబ్లీ స్థానాలకు 2014 లో కొత్తగూడెంలో జలగం వెంకట్రావు ఒక్కరే గులాబీ పార్టీ నుంచి గెలిచారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల గెలవటంతోపార్టీ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. అయినా 2018 ఎన్నికల్లో తిరిగి బీఆర్‌ఎస్ ఒక్క సీటుకే పరిమితం అయింది. ఆ తర్వాత కూడా మరోసారి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు.
ధీమాగా కాంగ్రెస్..
ఖమ్మంలో పట్టు కోల్పోయినా ఇతర జిల్లాల్లో ఏకపక్షంగా గులాబీ పార్టీ సీట్లు సాధించటంతో రెండుసార్లు అధికారానికి ఇబ్బంది జరగలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది. మిగిలిన జిల్లాల్లో బీఆర్‌ఎస్‌తో హారాహోరీగా తలపడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సెగ్మెంట్లలో ఈసారి పోటా పోటీ రాజకీయం కొనసాగుతోంది. జిల్లాలో ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టాలని పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్‌తే అన్న ధీమాతో ఉంది. ఖమ్మం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేస్తున్నారు. కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ సామాజికవర్గాల ప్రభావం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్సార్టీపీ ఈసారి పోటీలో ఉండటం లేదు. ఈ రెండు పార్టీలకు చెందిన మద్దతు దారులు.. సానుభూతి పరులు కాంగ్రెస్ వైపు చూస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్‌కు పట్టు చిక్కేనా?
వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు బెడిసికొట్టినట్లుగా కనిపించినా..తాజాగా పొత్తు ఖాయం దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో జిల్లాలోని కొత్తగూడెం స్థానం సీపీఐకు దాదాపు ఖరారైంది. ఖమ్మం జిల్లా పైన కాంగ్రెస్ తొలి నుంచి గురి పెట్టింది. రాహుల్ గాంధీతో తొలి సభ ఇక్కడే నిర్వహించి ఎన్నికల సమరశంఖం పూరించారు. బీఆర్‌ఎస్‌లో కీలకంగా పని చేసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్దులుగా నిలిచారు. దీంతో బీఆర్‌ఎస్‌కు ఈసారి కూడా పట్టు చిక్కే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. మరోవైపు ఇద్దరు కీలక నేతలు బీఆర్‌ఎస్ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తామని శపథం చేశారు. ఈ క్రమంలో గులాబీ నేతలు ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టినా.. ఫలితం కనిపించడం లేదు. దీంతో ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి పువ్వాడ’కు కూడా గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం గులాబీ పార్టీలోనే వ్యక్తమవుతోంది.
మొత్తంగా ప్రస్తుత పరిణామాలు జిల్లాలో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పది సీట్లు అధికారం డిసైడ్ చేయటంలో కీలకం కానున్నాయి. మరి.. బీఆర్‌ఎస్ ఇక్కడ తిరిగి పుంజుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో.. కాంగ్రెస్‌ను ఎలా ఓడిస్తుందో చూడాలి.