Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యంపై ఓటరు తీర్పు ఇవ్వనున్నారు. దీంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో రాష్టమంతా ఓ ఎత్తు అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరో ఎత్తు అన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని 119 సీట్లలో 24 స్థానాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. దాదాపు కోటి మంది ఓటర్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని సీట్లలో 24 నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గ్రేటర్ ఓటరు నాడీ ఏ పార్టీకి అంతుచిక్కడం లేదు. దీంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే గతంలో బీఆర్‌ఎస్ బలంగా ఉండటం, ఎంఐఎం తన సీట్లు తాను కచ్చితంగా గెలిచే పరిస్ధితులు ఉండేవి. కానీ ఈసారి పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
9 స్థానాల్లో చతుర్ముఖపోటీ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో 9 సీట్లలో మాత్రం ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మిగిలిన 15 నియోజకవర్గాల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మైనార్టీలైన ముస్లింలు, క్రై స్తవులు, సిక్కులు, జైనులు ఇక్కడి ఓటర్లలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉన్నారు. దీంతో ఈసారి వీరి మొగ్గు ఎటు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
బరిలో 23 మంది సిట్టింగులు..
గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లలో బీఆర్‌ఎస్, ఎంఐఎంకు కలిపి 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో స్ధానం గోషామహల్లో మాత్రం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఈసారి గోషామహల్‌తో పాటు మరిన్ని స్ధానాల్లో గెలిచేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో ఈసారి ఖాతా తెరిచి పునర్ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది.
2014లో బీఆర్‌ఎస్‌కు మూడు స్థానాలే..
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే బీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీకి జరిగిన 2016, 2020 ఎన్నికల్లో పట్టు పెంచుకుని కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కంటే ఆధిపత్యం తెచ్చుకుంది. ఎంఐఎం కూడా హైదరాబాద్ ఎంపీ సీటు పరిధిలోని 7 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. కానీ ఈసారి మాత్రం ఈ సమీకరణాలన్నీ మారిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వీస్తున్న కాంగ్రెస్ గాలి గ్రేటర్ పరిధిలోనూ బీఆర్‌ఎస్ ఓట్లకు గండి కొట్టేలా ఉంది.
బీఆర్‌ఎస్ ఇలా..
ప్రస్తుతం గ్రేటర్‌లో పటాన్‌చెరు, కుతుబుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్‌లలో బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమంది తిరిగి గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. మల్కాజిగిరి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కొత్త అభ్యర్థులను నిలిపింది. ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం కూడా తన పరిధిని దాటి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది.
కాంగ్రెస్ ఇలా..
ఇక కాంగ్రెస్ కూడా మాజీ ఎంపీలు మధు యాష్కీగౌడ్ (ఎల్‌బీ నగర్), అంజన్‌కుమార్ యాదవ్ (ముషీరాబాద్), మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(మహేశ్వరం), ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), పి విజయారెడ్డి (ఖైరతాబాద్)కి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది.
బీజేపీ కూడా..
అలాగే బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యేలు టి. నందీశ్వర్ గౌడ్ (పటాన్‌చెరు), కూన శ్రీశైలం గౌడ్ (కుతుబుల్లాపూర్), ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్ (ఉప్పల్), సి. కృష్ణ యాదవ్ (అంబర్‌పేట్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్), మర్రి శశిధర్‌రెడ్డి(సనత్‌నగర్), మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు(మల్కాజిగిరి) పోటీలో ఉన్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఆసక్తికర పోరు నెలకొంది.