Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. తొలిరోజు వంద నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని నువ్వా నేనా అన్నట్లు పోటీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. తొలి విడత 55, రెండో లిస్ట్‌లో 45 మందికి టిక్కెట్లు కేటాయించింది. దీంతో మొత్తం 119 స్థానాలకు ఇప్పటి వరకు 100 టిక్కెట్లు ఇచ్చింది. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులపై ఎటూ తేల్చలేకపోతోంది. ఈ 19 స్థానాలు కూడా బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నవే కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమే. కానీ, పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి. ఎవరిని బుజ్జగించాలి అనేది తేల్చుకోలేకపోతోంది. బుజ్జగింపులతో డ్రాప్ అవ్వడానికి ఎవరూ అంగీకరించడం లేదని తెలుస్తోంది.
19 స్థానాలు ఇవే..
కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించని 19 స్థానాలు..వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ . ఈ స్థానాల్లో నిలిపే అభ్యర్థుల కోసం పార్టీలోని సీనియర్ నేతలు.. తలా ఓ పేరు ప్రతిపాదించారు. తాము చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను హైకమాండ్‌కు అప్పగించింది. రెండు జాబితాల ద్వారా కాంగ్రెస్ 100 మంది అభ్యర్ధుల పేర్లు ఖారారు చేసింది. 19 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో.. హైదరాబాద్‌లో మకాం వేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేయడం లేదు.
19 స్థానాలల్లో కీలక అభ్యర్థులు..
కాంగ్రెస్ ప్రకటించని 19 నియోజకవర్గాల్లోనూ పార్టీలో సీనియర్లు, కీలక అభ్యర్థులే టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడి నుంచి కేసీఆర్ బరిలో నిలుస్తుండడంతో కాంగ్రెస్ రేవంత్‌ను దించాలని యోచిస్తోంది. నిజామాబాద్ అర్బన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ మైనారిటీకి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. సిరిసిల్లలో కేటీఆర్‌పై ఉత్తంకుమార్ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దించాలన్న చర్చ జరగుగోతోంది. ఇక కరీంనగర్‌లో ఒక సీనియర్ నాయకుడు, ఒక మాజీ ఎమ్మెల్యే తనయుడు, ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి పార్టీలో చేరిన మున్నూరుకాపు నాయకుడు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ కూడా ఎంపిక టీపీసీసీకి కష్టంగా మారింది. ఖమ్మంలోని నాలుగు నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు పెద్దగా పట్టులేదు. దీంతో బలమైన వారినే ఈసారి బరిలో దింపాలని కాంగ్రెస్ ఆలోచన.
కమ్యూనిస్టులతో కటీఫ్?
పెండింగ్‌లో 19 సీట్లలో 4 కమ్యూనిస్టులకు కేటాయించాలని మొదట నిర్ణయించారు. కానీ ఏయే స్థానాలు ఇస్తారో క్లారిటీ ఇవ్వకపోవడంతో సీపీఎం ఇప్పటికే పొత్తుకు కటీఫ్ చెప్పింది. 19 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. సీసీఐ మాత్రం చివరి వరకూ వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతోంది. అయితే ఏయే సీట్లు ఇస్తారన్న అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం కమ్యూనిస్టులతో ఇంకా చర్చలు సాగుతున్నాయని చెబుతున్నారు. కమ్యూనిస్టులతో చర్చలు కొలిక్కి వస్తే.. నేడో రేపో.. మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.