Telangana Elections 2023: అది ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న ఒక నియోజకవర్గం. అక్కడ బిసి, ఎస్సీ, ఎస్టీ ఓట్లు అధికంగా ఉంటాయి.. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. గత మూడు పర్యాయాలు గెలుపొందారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన ఒక పార్టీ లో ఉన్నారు. గెలిచిన కొంతకాలానికే అధికార పార్టీలోకి చేరిపోయారు.. ఆ తర్వాత పార్టీ పెద్దలకు అత్యంత దగ్గరయ్యారు. ఆయన నియోజకవర్గంలోని వ్యక్తి పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్నారు. అంతేకాదు పెద్దల సభ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పైగా ఆ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీలోని ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ ను అధికార పార్టీ అధిష్టానం అత్యంత సీరియస్ గా తీసుకుంది.
పంపకాలు షురూ
అయితే ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న ఆ నియోజకవర్గ బాధ్యతను ఆ పారిశ్రామికవేత్త అప్పజెప్పింది.. ఇంకేముంది వెంటనే రంగంలోకి దిగిన ఆ పారిశ్రామికవేత్త తనకున్న డబ్బు బలంతో కొనుగోళ్లకు తెర లేపారు. ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. ఇటీవల ఆ నియోజకవర్గం లో ప్రతిపక్ష పార్టీ టికెట్ ను ఒక మహిళ అభ్యర్థికి కేటాయించింది. దీంతో ఆ పార్టీలో అప్పటి దాకా ఉన్న వారంతా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వారి వద్దకు సదరు పారిశ్రామికవేత్త, అధికార పార్టీ అభ్యర్థి తమ దూతలను పంపారు. అధికారంలోకి వస్తే వారికి ఇచ్చే ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రస్తుతానికి వారి అవసరాల ఆధారంగా డబ్బును ఆఫర్ చేశారు. డబ్బు ఎవరికీ చేదు కాదు కాబట్టి.. దానికి ఆ ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఓకే చెప్పేశారు. వాళ్లు అలా అనడమే ఆలస్యం తెల్లారేసరికి నోట్ల కట్టలు వారి వద్దకు చేరుకున్నాయి. అలా చేరుకున్న నగదు కోట్లల్లో ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
అధిష్టానం ఆదేశాలతోనే
ఈ నియోజకవర్గ ఏర్పడిన నాటి నుంచి మొన్నటి వరకు ఇలాంటి డబ్బు రాజకీయాలు చూడలేదని అక్కడి ప్రజలు అంటున్నారు.. ఎప్పుడైతే ఆ పారిశ్రామికవేత్త పెద్దల సభ సభ్యుడు అయ్యాడో ఒకసారిగా పరిస్థితి మారిపోయిందని అక్కడి ఓటర్లు చర్చించుకుంటున్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తులను.. కోలాటాల బృందాలను, డప్పు కళాకారులను, కుల సంఘాల నాయకులను కూడా వదిలిపెట్టడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. గుడికి, చర్చి నిర్మాణానికి , మసీదుల ఏర్పాటుకు కూడా ధారాళంగా డబ్బులు ఇస్తున్నారని అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ఎవరైనా అడిగితే.. అధిష్టానం కచ్చితంగా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని తేల్చి చెప్పింది. అందుకే ఈ పద్ధతిని మేము ఎంచుకున్నామని వారు సమాధానం చెబుతున్నారు. మీడియా ప్రతినిధులకు కూడా భారీగానే డబ్బులు ముట్ట చెబుతుండడంతో ఈ పంపకాలకు సంబంధించిన వార్తలు బయటి సమాజానికి తెలియడం లేదు. ఈ డబ్బు పంపకాలను కూడా అత్యంత రహస్యంగా జరుపుతుండడంతో రెండవ కంటికి కూడా ఏం జరుగుతుందో తెలియడం లేదు. కాగా ఈ పరిణామాలలో జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజానికి మంచివి కావని హితవు పలుకుతున్నారు. అయినా కోట్లకు కోట్ల డబ్బు పంపిణీ చేస్తుంటే వారి మాటలు మాత్రం ఎవరు వింటారు. ధనం మూలం ఇదం జగత్!