
దేశంలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన వారం పదిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే భారత్ కరోనా కేసుల్లో ఇటలీని దాటేసింది. ఇటీవలే 3లక్షల కేసుల మార్కును దాటేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే భారత్ కరోనా కేసుల్లో తొలి మూడు దేశాలతో పోటీపడేలా కన్పిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు 5వేల మార్కును దాటాయి. సోమవారం కొత్తగా 219కేసులు నమోదుగా మొత్తంగా ఈ సంఖ్య 5,193 చేరింది.
తెలంగాణలో పంజా విసురుతున్న వైరస్..
తెలంగాణలో సోమవారం నాటికి 5,193కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2766 కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 2240 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.వీరిలో 449 మంది వలస కార్మికులు, విదేశీయులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మృతుల సంఖ్య సోమవారం నాటికి 187కు చేరుకుంది. సోమవారం 219 కొత్త కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 189 కేసులు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 13, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ అర్బన్ జిల్లాలో 4, మహబూబ్‌నగర్‌లో 1, మెదక్‌లో 1, ఆదిలాబాద్‌లో 1, యాదాద్రి భువనగిరిలో 1, వరంగల్ రూరల్ జిల్లాలో 3, వనపర్తి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.
ఎవరినీ వదలని మహమ్మరి..
కరోనా ఎవరిని వదలేదడం లేదు. కరోనాపై ముందుడి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులకు సైతం మహమ్మరి సోకడం శోచనీయంగా మారింది. కరోనా వారియర్స్ పదుల సంఖ్యల్లో కరోనా బారినపడటంతో ఆందోళన నెలకొంది. వీరితోపాటు ప్రజాప్రతినిధులు, సెలబెట్రీలు సైతం కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు కరోనా నుంచి త్రుటిలో తప్పించుకొని హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంకా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు.
వైద్యులకు కరోనా.. ఆందోళనలో ప్రజలు..
కరోనా మహమ్మరిపై పోరాడుతున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మరి బారినపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తరుచుగా డాక్టర్లు, వైద్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. సోమవారం వైద్య సిబ్బందికి జరిపిన పరీక్షల్లో 32మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరిలో 14మంది డాక్టర్లు, 18మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా కూడా పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఒకే ఆస్పత్రిలో పనిచేస్తున్న 32మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.
అదేవిధంగా ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతోపాటు, నిమ్స్, కింగ్ కోఠి, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు కరోనా బారిన పడ్డారు. నిమ్స్ లో వైద్యులు కరోనా బారినపడటంతో అక్కడ తాత్కాలికంగా వైద్యసేవలు నిలిపివేశారు. ప్రతీరోజు వైద్య సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా బారినపడటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. వీరితోపాటు పోలీసులు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో 50వేల కరోనా టెస్టులు చేసేందుకు కేసీఆర్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కరోనా టెస్టులకు గ్రీన్ సిగ్నల్..
అదేవిధంగా రాష్ట్రంలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. రోజురోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు ఎప్పుడు కట్టడి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కరోనాపై సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!