Telangana Congress: కాంగ్రెస్ పార్టీ పేదది. అందులో ఉన్న నాయకులు ధనవంతులు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది.. ఇక ఆ పార్టీలో సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నియమించడానికి చాలా కాలమే పట్టింది. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిని చేసేందుకు అనేక సంప్రదింపులు జరిగాయి. ఎందుకంటే పార్టీలో ఉన్న సీనియర్లు ఒక తాటి మీదికి రాకపోవడంతో ఈ సమస్య ఎదురయింది. సీనియర్లను బుజ్జగించి, వారు చెప్పినట్టు వింటేనే అంతా సవ్యంగా జరుగుతుంది. లేకపోతే రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే ఎన్నికల ముంగిట ఈసారి ఇదే పరిస్థితి ఎదురవుతుండడం, ఎన్నికల్లో ఓటమి పలకరిస్తుండడంతో పార్టీ ఒక్కసారిగా మార్పునకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్న సీనియర్లకు ముకుతాడు వేసింది. దీంతో టికెట్ల విషయంలో సీనియర్ నేతలు ఎవరు కూడా నోరు విప్పడం లేదు. దీనికి కారణం హైకమాండ్ ఇచ్చిన షాకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొన్నటిదాకా మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా అనేక మంది సీనియర్లు తమకు, తమ కుటుంబ సభ్యులకు రెండేసి చొప్పున టికెట్లు కావాలని డిమాండ్ చేశారు. అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. విలేకరుల సమావేశంలోనూ పార్టీ పరువు తీసే విధంగా మాట్లాడారు. పార్టీ నిర్వహించే అంతర్గత సమావేశాల్లోనూ ఇవే విషయాలను లేవనెత్తి, మీడియాకు లీకులు ఇచ్చేవారు. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించింది. పైగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ కుటుంబమే ఒక కుటుంబం నుంచి ఒకరికి టికెట్ అనే విధానాన్ని పాటించడం మొదలుపెట్టింది. దీన్ని ఉదాహరణగా తీసుకుని హైకమాండ్ సీనియర్లకు తిరుగులేని విధంగా సమాధానం చెప్పింది.
కుటుంబంలో రెండు టికెట్లు అడుగుతున్న నాయకులకు సరైన క్లాస్ తీసుకుంది. గతంలో మాదిరి పరిస్థితి ఇప్పుడు లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది..బీ ఫామ్ మీకు కావాలో, మీ కుటుంబ సభ్యులకు కావాలో తేల్చుకోవాలని హై కమాండ్ స్పష్టం చేసింది. చేరికల విషయంలోనూ ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. నల్లగొండ జిల్లాలో ఇకపై ఎవరిని కూడా చేర్చుకోమని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. ఆయన వ్యతిరేకిస్తున్నప్పటికీ వేముల వీరేశాన్ని పార్టీలో చేర్చుకుంది. దీంతో వెంకటరెడ్డి సైలెంట్ అయిపోయారు. మరోవైపు కొత్తగా పార్టీలో చేరే వారికి, ఒకవేళ వారికి స్థానికంగా ప్రజల్లో విపరీతమైన బలం ఉంటే కచ్చితంగా రెండు, మూడు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. మైనంపల్లి హనుమంతరావుకు మూడు టికెట్లు దక్కడం వెనుక అసలు కారణం ఇదేనని సంకేతాలు ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి తో నేరుగా తలపడి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ ఇచ్చినప్పటికీ స్థానికంగా ప్రజాబలం లేకుంటే బీ ఫామ్ కూడా మారుస్తామని సంకేతాలు ఇస్తోంది. ఈసారి కారును బలంగా ఢీ కొట్టాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఏ అంశంలోనూ వెనకడుగు వేయడం లేదు. ఈ పరిణామాలతో సీనియర్లు సైలెంట్ అయిపోయారు. వారు గతంలో చేసిన బెదిరింపు రాజకీయాలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు.