CM Jagan: ఏపీ క్యాబినెట్ లో ఉన్న నలుగురు సీనియర్ మంత్రులకు జగన్ జలక్ ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్ లేనట్టేనని సంకేతాలు ఇచ్చారు. అందులో ఇద్దరు ఉమ్మడి ఏపి లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన వారే. నాలుగు రోజుల కిందట పార్టీ వర్క్ షాప్ లో పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను తప్పిస్తానంటూ జగన్ తేల్చి చెప్పారు. అయితే ఈ జాబితాలో ఏకంగా నలుగురు మంత్రులు ఉండడం విశేషం. అందులో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరికీ పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా బొత్స సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని జగన్ కి చెప్పగా ఆయన నిరాకరించినట్లు సమాచారం. చీపురుపల్లి నుంచి మీరే పోటీ చేయండి.. లేకుంటే ఎంపీగా వెళ్ళండి అని సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం. దీంతో బొత్స షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడికి చీపురుపల్లి అసెంబ్లీ, తనకు ఎంపీ సీటు ఇవ్వాలని బొత్స పట్టుబడుతున్నట్లు సమాచారం. తనకు రాజ్యసభ సీటు ఇస్తే తప్పుకుంటానని సైతం ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అలా అయితే 2026 వరకు ఆగండి అంటూ.. అప్పుడు రాజ్యసభ చూస్తాను అంటూ జగన్ తేల్చేసినట్లు సమాచారం. దీంతో బొత్సకు సీన్ అర్థం అవడంతో మౌనం దాల్చినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుది అదే పరిస్థితి. తొలి మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావుకి చోటు దక్కలేదు. మొన్నటికి మొన్న విస్తరణలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఆయనకు టిక్కెట్ విషయంలో జగన్ పెండింగ్ పెట్టినట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడికి అవకాశం కల్పించాలని ప్రసాదరావు సీఎం జగన్ ను కోరారు. అయితే అందుకు జగన్ సమ్మతించలేదని తెలుస్తోంది. మీరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అందుకే ఇటీవల ధర్మాన తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేరుగా సీఎం జగన్ కి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీగా అయితే ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉండడంతో ధర్మాన తటపటాయిస్తున్నారు. తన కుమారుడికి భరోసా ఇవ్వకపోవడంపై కోపంతో రగిలిపోతున్నారు.
అటు స్పీకర్ తమ్మినేని సీతారాం ది అదే పరిస్థితి. ఈసారి ఆమదాలవలస నుంచి తాను కాకుండా కుమారుడికి అవకాశం కల్పించాలని ఆయన కోరుతూ వచ్చారు. అయితే అక్కడ వర్గ విభేదాలు అధికంగా ఉన్నాయి. స్పీకర్ తీరుపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని నివేదికలో తేలుతోంది. అందుకే ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే తమ్మినేని సీతారాంకు ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పీకర్ తమ్మినేని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న జగన్కు అండగా ఉంటే ఇలా చేస్తున్నారు ఏంటి అని తమ్మినేని రుస రుసలాడుతున్నట్లు సమాచారం.
మరోవైపు విశాఖలో సైతం మంత్రి అమర్నాథ్ కు స్థానచలనం తప్పదని సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడంతో.. ఈసారి అమర్నాథ్కు ఎంపీగా పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. అక్కడ ఎంపీగా ఉన్న మహిళా నేతను అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాను కలుపుతూ ఉన్న అరకు పార్లమెంటరీ స్థానం నుంచి ఓ మంత్రిని బరిలో దింపుడు ఉన్నట్లు సమాచారం. ఎంపీగా ఉన్న బొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే సీఎం జగన్ క్యాబినెట్లో సీనియర్ మంత్రులకు జలక్ ఇచ్చినట్లు అవుతోంది.