Telangana Congress leaders: తెలంగాణ కాంగ్రెస్ లో వర్గాలు సహజం. అది సర్వసాధారణం కూడా. అయితే ఓ విషయమై ఏపీలో చర్చ నడుస్తోంది. ఏపీలోనే తెలుగుదేశం, వైయస్సార్సీపి మద్దతుదారులుగా అక్కడ కాంగ్రెస్ నాయకులు విడిపోయారు అన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. న్యూట్రల్ గా వ్యవహరిస్తోంది. కానీ టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో వైసీపీ సైతం అదే బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి చర్చ గా మారింది.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో టిడిపి నాయకుడు. చాలా యాక్టివ్ గా పని చేశారు. తెలుగుదేశం పరిస్థితి బాగా లేకపోవడంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అలా వెళ్లిన కొద్ది రోజుల వ్యవధిలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరుగుతోంది. సహజంగానే టిడిపి శ్రేణులు ఆయన వైపు మొగ్గు చూపుతున్నాయి. అటు రేవంత్ రెడ్డి సైతం టిడిపి పట్ల, చంద్రబాబు పట్ల విధేయత చూపుతున్నారు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏపీలో టిడిపి వర్గంగా ముద్ర పడిపోయారు. ఇదే సమయంలో అధికార వైసిపి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం కూడా.. ఆయన టిడిపి మనిషిగా తేలిపోయింది.
మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉన్న వైసిపి తీరులో కూడా మార్పు వచ్చింది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. షర్మిల బేషరతు మద్దతు వెనుక జగన్ ఉన్నారన్న అనుమానం కూడా ఉంది. గతంలో రాజశేఖర్ రెడ్డి తో పని చేసిన చాలామంది నాయకులు.. ఇప్పటికీ జగన్ అంటే అభిమానిస్తున్నారు. జగన్ కెసిఆర్ తో సన్నిహితంగా ఉండడం వల్ల వారంతా దూరంగా ఉండేవారు. అయితే రెడ్డి సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు సంకేతాలు అందుకున్న జగన్ పునరాలోచనలో పడ్డారు. అందుకే పార్టీ శ్రేణులకు సైతం ఒక రకమైన సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇలాంటి నేతలు జగన్ వర్గంగా ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాతే కాంగ్రెస్ నాయకులు ముసుగు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఏపీ రాజకీయాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడడానికి చంద్రబాబు పావులు కదిపే అవకాశం ఉంది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా జగన్ పావులు కడిపి కాంగ్రెస్కు దగ్గరయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా ఏపీలో రెండు పార్టీలకు అనుకూలంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉండడం విశేషం. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఏపీలోనే తెలుగుదేశం, వైయస్సార్సీపి మనుషులుగా చలామణి కావడం విస్తు గొలుపుతోంది.