Congress Operation Ghar Wapsi: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. ఆపరేషన్ ఘర్ వాపసీని స్పీడప్ చేసే దిశగా టీపీసీసీ చీఫ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ నుంచి వెళ్లినవారు తిరిగి రావాలని కోరారు. చాల ఆమందితో రేవంత్‌రెడ్డి స్వయంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ, ఆయన పిలుపుకు ఇప్పటి వరకు పెద్ద నేతలెవరూ స్పందించలేదు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, బీజేపీలో చేరి అక్కడ అసంతృప్తితో ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
కర్ణాటక రిజల్ట్స్ తర్వాత దూకుడు..
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించి, పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి రావాలని ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీలో ఇబ్బంది పడుతున్న నేత ఈటల రాజేందర్‌ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు.
రేవంత్ ప్రత్యేక వ్యూహం..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలను, ఇతర పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును కూడా హస్తం పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాహులగాంధీ వారితో మాట్లాడగా, త్వరలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
ఈటల ప్రకటనతో జోష్..
తాజాగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం లేదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సవయంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది. ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు రాగలిగితే, ఆపై చేరికలు జోరుగా కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈనెలలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. ఒకవేళ ఇది గనుక సక్సెస్ అయితే, కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని కాంగ్రెస్ అధినాయకత్వం అంచనా.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఘర్ వాపసీ తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.