తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా నాయకులంతా తమ గొంతు పెంచారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పులను ఎత్తిచూపిస్తూ ఎక్కడ లేని హడావిడి చేస్తున్నారు. ఒకరిద్దరు కాకుండా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు అంతా ఇప్పుడు టిఆర్ఎస్ ను ఎండగట్టడమే పనిగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. టిపిసిసి ప్రెసిడెంట్ పదవి కోసం ఇన్ని రోజులు వారిలో వారు కొట్టుకున్న కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు టిఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారిగా పార్టీలోని అంతర్గత విభేదాలను మాని మూకుమ్మడిగా అందరూ కలిసి అధికార పార్టీ పైకి వెళ్లడం ఏమిటని ఇప్పుడు చాలామందికి సందేహంగా మారింది.
Also Read : కేసీఆర్ సార్.. మీరు సాధించారు పో..!
ఒక పక్క తెలంగాణలో బిజెపి బలం పడిపోతుంది. కాంగ్రెస్ ప్రధాని ప్రతిపక్షం స్థలాన్ని ఆక్రమించేందుకు వారు ప్రయత్నిస్తుండడం…. ఇక కేంద్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో ఉండటం కాంగ్రెస్ నేతలను పూర్తి కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే బిజెపి తెలంగాణలో ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పాతుకుపోతుంది. ఇక ఇలా ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే…. మళ్ళీ తెలంగాణ అధికార టీఆర్ఎస్ గాని బీజేపీ గాని పవర్ ను ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ వారు ఇప్పుడు మరింత స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.
వాస్తవంగా మాట్లాడుకుంటే…. మొన్నటివరకు రేవంత్ రెడ్డి ఒక్కరే టిఆర్ఎస్ ను విపరీతంగా టార్గెట్ చేసేవారు. అతనికి సహచరుల నుంచి కనీస సహకారం కరువైపోయేది. అతను కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసమే ఇదంతా చేస్తున్నారని సొంత పార్టీలోనే భయంకరమైన విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సీనియర్లంతా కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటానికి దిగినట్టు కనిపిస్తున్నారు.
ఒకవైపు భట్టి విక్రమార్క ఆసుపత్రి సందర్శన పేరుతో తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జరిగిన ప్రమాదంపై విచారణ చేయించాలని నానా హడావిడి చేస్తున్నాడు. అవసరమైతే సిబిఐని కూడా తీసుకువచ్చేందుకు మేం వెనకాడమని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్రంలోని పలు సమస్యలపై కేసీఆర్కు వివరించేందుకు అపాయింట్మెంట్ కావాలని లేకపోతే నిరసన దీక్ష చేపడతానని అంటున్నాడు. మొత్తానికి ఏం జరిగి కాంగ్రెస్ నేతల్లో ఈ మార్పు వచ్చిందో తెలియదు కానీ.. ఇదంతా మూడునాళ్ళ ముచ్చటగానే ఉన్నట్లుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే నిజంగా వారు బిజెపి దూకుడుకి భయపడ్డారా…? లేకపోతే వారికి వారే తమ తప్పులు తెలుసుకుని అధికార పార్టీని ఎండగట్టడం మొదలుపెట్టారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : కేసీఆర్ అన్నట్టే.. కొండంత అవినీతి?