Telangana Congress: టీపీసీసీలో మరోసారి వివాదాలు రేగుతున్నాయి. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత సీనియర్లు చాలా మంది అలకబూనారు. కొందరు అధిష్టానంపై మాటలు తూలారు. దీంతో అధిష్టానం అందరిని పిలిపించి మందలించింది. దీంతో వివాదం సద్దుమనుగుతుందనుకున్నా ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికి కూడా సీనియర్లు తమ వైఖరి వీడటం లేదు. అధ్యక్షుడిపై విమర్శలకే పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో చులకన అయిపోతున్నారు. ఇటీవల ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కానీ దీనిపై తనకు సమాచారం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో సమావేశమై దీనిపై చర్చించుకున్నారు. త్వరలోనే జగ్గారెడ్డిని పిలిపించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలే తప్ప బహిర్గతంగా లేఖలు రాయడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి తీరుపై ఆక్షేపణలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.
Also Read: రేవంత్ రెడ్డి నిర్బంధంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో?
టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో కూడా నేతల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఇలా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. గతంలోనే సీనియర్లకు హెచ్చరికలు జారీ చేసినా వారి శైలిలో మార్పు రాకపోవడం గమనార్హం.
దీంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా ప్రస్తుతం సీనియర్లలో మళ్లీ అసంతృప్తులు రేగుతున్నాయి. ఫలితంగానే జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. కానీ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలని భావించిన రేవంత్ రెడ్డి చూస్తుంటే సీనియర్లు మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. ఫలితంగా పార్టీ బలోపేతం కావడం లేదు. దీంతో పార్టీ ముందుకు వెళ్లడం లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. క్రమశిక్షణా సంఘం జగ్గారెడ్డిపై ఏ చర్య తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టార్గెట్ 40 సీట్లు.. మళ్లీ దానికో లెక్కుంది..?