హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎంతటి సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నదో ఇప్పటికే అర్థమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తన దృష్టిమొత్తం ఈ ఎన్నికపైన పెట్టారన్న విషయం.. ఆయన మాటలు, చేతలే నిరూపిస్తున్నాయి. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. ప్రభుత్వ పథకాలు, పార్టీల్లో చేర్చుకోవడాలు, పదవులు పంచడాలు.. అన్నీ ఆ నియోజకవర్గంలోనే సాగుతున్నాయి.
ఇటు బీజేపీ కూడా పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈటల గెలుపు ద్వారా.. కేసీఆర్ పని అయిపోయిందని ప్రచారం చేయాలని భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని చాటాలని చూస్తోంది. కాబట్టి.. ఏం చేసైనా ఇక్కడ గెలవాలని చూస్తోంది. ఇప్పటికే ఈటల ప్రజాదీవెన యాత్ర చేపట్టి జనంలోకి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా బ్రేక్ పడింది. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇక్కడ అతిపెద్ద బలం ఈటల రాజేందర్ మాత్రమే అన్నది నిర్వివాదం. రెండు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆయన.. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ తెలుసు. ఆ పరిచయమే తనను గెలిపిస్తుందని భావిస్తున్నారు.
ఈ విధంగా.. రెండు పార్టీలో హోరాహోరీగా పోరాటం సాగిస్తుంటే.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్. ఆ నియోజకవర్గంలోని పలువురు నేతలు గులాబీ, బీజేపీ గూటికి చేరిపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కారెక్కారు. దీంతో.. ఈ ఎన్నికను ఎలా గట్టెక్కించాలా అనే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ పీసీసీ తీసుకున్న తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో.. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న విషయంతో తర్జనభర్జన పడుతున్నారు.
హుజూరాబాద్ లోని నేతనే ఎంచుకోవాలా? ఉమ్మడి కరీం నగర్‌లోని బలమైన నేతను దింపాలా? అని చూస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు గాంధీ భవన్ లో నేతలు సమావేశం కానున్నారు. పీసీసీ అధినేత రేవంత్ తోపాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వంటివారు పార్టీకి 5 శాతానికి మించి ఓట్లు రావంటూ ప్రకటనలు కూడా చేశారు. మరి, ఈ పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్నది చూడాలి.