CM Revanth Reddy: మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. విభజన సమస్యలకు మాత్రం మోక్షం లభించలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఏపీలో జగన్ అధికారంలో ఉండేవారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కెసిఆర్ అధికారాన్ని వెలగబెట్టారు. ఏపీకి తొలి అయిదు సంవత్సరాలు చంద్రబాబు సీఎం గా ఉండేవారు. ఆయనకు కేసిఆర్ తో రాజకీయ విభేదాలు ఉండడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అంతా భావించారు. కానీ తరువాత కెసిఆర్ స్నేహితుడు జగన్ అధికారంలోకి వచ్చారు. రాజకీయంగా పరస్పరం స్నేహం అందించుకునేవారు. కానీ విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి బీఆర్ఎస్ నేతలను, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ ఆసక్తికర పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. విభజన సమస్యలకు సంబంధించి చాలా అంశాలు చర్చకి వచ్చాయి. తెలంగాణ ప్రయోజనాలను అప్పట్లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ గాలికి వదిలేసిందని.. ఏపీతో చాలా సమస్యల పరిష్కారానికి అనువైన పరిస్థితి ఉన్నా.. కావాలనే కాలయాపన చేశారని సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ మంత్రులు విరుచుకుపడ్డారు. కెసిఆర్ చిత్తూరు వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని ఆశీర్వదిస్తారని.. హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్లి రోజా వస్తుంటారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ జగన్ వచ్చినప్పుడు కెసిఆర్ ఆయనకు విందు భోజనం వడ్డించి మరి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేందుకు సహకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ విందులతోనే రాయలసీమలో ఎత్తిపోతల పథకాలకు పునాది పడిందని కూడా ఆరోపణలు చేశారు.
సరిగ్గా తెలంగాణ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏపీ సీఎం బలవంతంగా నాగార్జునసాగర్ డ్యాం మీదకు బలగాలను పంపించడం ఎవరి ప్రయోజనాల కోసమని రేవంత్ ప్రశ్నించారు. కనీసం నాడు అడ్డుకునే ప్రయత్నం చేశారా అంటూ కేసిఆర్ ని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన యోధుడిగా, తెలంగాణను అభివృద్ధి చేసిన నేతగా కెసిఆర్ ను బిఆర్ఎస్ నేతలు ప్రొజెక్ట్ చేస్తున్నారు . దానిని తిప్పుకొట్టేందుకే రేవంత్ ఏపీ తో ముడి పెడుతు మరి అటాక్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తీరును కూడా రేవంత్ ఎండగడుతున్నారు. సరిగ్గా ఏపీ ఎన్నికల సమయంలోనే విభజన హామీలు అమలు అంటూ జగన్ కేంద్రం వెంపర్లాడుతున్నారు. రాష్ట్రాల స్థాయిలో పరిష్కార మార్గం ఉన్నా.. జగన్ ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశారని ఏపీ సమాజానికి అర్థమయ్యేలా రేవంత్ వ్యాఖ్యలు ఉండడం విశేషం. అయితే రేవంత్ ఈ తరహాలో విరుచుకుపడుతున్నా వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినదానికి.. కాని దానికి మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం సైలెంట్ గా ఉండడం విశేషం.