Union Budget Of India 2022: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. పాతికేళ్ల విజన్‌తో దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదని, ఇది పసలేని బడ్జెటని విపక్షాలు విమర్శించాయి. తాజాగా ఈ బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టీలతోపాటు బీసీ వర్గాలకు , రైతాంగాన్ని నిరాశకు గురి చేసిందని అన్నారు. ముఖ్యంగా దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని పేర్కొన్నారు. దశ, దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ ఈ బడ్జెట్ అని కేసీఆర్ ఆరోపించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీతో కూడి ఉన్నదని అన్నారు. మసిపూసి మారేడు కాయ చేయడం బడ్జెట్ లో స్పష్టంగా కనబడుతున్నదని చెప్పారు. సామాన్యులను తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లోకి ఈ బడ్జెట్ నెట్టిందని పేర్కొన్నారు. దేశ రైతాంగాన్ని ఆదుకునేందుకుగాను కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సీఎం విమర్శించారు. ఇదొక బిగ్ జీరో బడ్జెట్ అని తెలిపారు.
Also Read: Union Budget Of India 2022: వేతన జీవులపై అదే ‘పన్ను’ బాదుడు.. బడ్జెట్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ?
కరోనా వలన ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఆదుకునేందుకుగాను కనీస మాత్రంగానైనా బడ్జెట్ లో కేటాయింపులు లేవని విమర్శించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు అస్సలు లేవన్నారు. ఇన్ కమ్ టాక్స్‌లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు ఎదురు చూశారని, కానీ, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు.
ఇకపోతే కరోనా మహమ్మారి వలన దేశవ్యాప్తంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వైద్యం, ప్రజా రోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధి విషయం కేంద్రం నిర్లక్ష్య పూరిత వైఖరి స్పష్టంగా కనబడుతున్నదని , ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కొవిడ్ నేపథ్యంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తున్నాయని, కానీ, ఆ విషయమై కేంద్ర ప్రభుత్వానికి అస్సలు సోయి లేదని కేసీఆర్ విమర్శించారు.