Telangana Budget 2023: అసలే ఎన్నికల ఏడాది.. ఒకవైపు విపక్షాల దూకుడు… మరోవైపు ప్రజల్లోని పలువర్గాల్లో అసంతృప్తి. వీటన్నింటినీ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తులను తొలగించేలా… అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా 2023_24 సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం జంబో బడ్జెట్ ప్రకటించింది. 2,90,396 కోట్లతో హరీష్ రావు సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం 37,525 కోట్లు అని వెల్లడించారు. వ్యవసాయం, నీటి పారుదల, విద్య, విద్యానికి అత్యధికంగా నిధులు కేటాయించారు.

నీటిపారుదల రంగానికి 26, 885 కోట్లు, వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు, విద్యుత్ రంగానికి 12,727 కోట్లు, హోమ్ శాఖకు 9,599 కోట్లు, ఆర్థిక శాఖకు 49,749 కోట్లు, విద్యాశాఖకు 19,093, వైద్య రంగానికి 12,161, ఆరోగ్యశ్రీ పథకానికి 1,463 కోట్లు, పరిశ్రమల శాఖకు 4,037, రోడ్లు భవనాల శాఖకు 2,500, పంచాయతీరాజ్ శాఖకు 31,426, ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,117, ప్రణాళిక విభాగానికి 11,495, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు 366, రుణమాఫీ పథకానికి 6,385, రైతు బంధు పథకానికి 15,075, రైతు బీమా పథకానికి 1,589, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి 200, ఆసరా పెన్షన్ల కోసం 12,000, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కు 3,210, దళిత బంధుకు 17,700, బీసీ సంక్షేమం కోసం 6,229, మహిళా శిశు సంక్షేమం కోసం 2,131, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం 36, 750, మైనార్టీ సంక్షేమం కోసం 2,200, గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి 15,223, మైనార్టీ సంక్షేమం కోసం 2,200, ఆయిల్ ఫామ్ కు 1000, అటవీ శాఖకు 1,471, హరితహారం పథకానికి 1,471, పట్టణ ప్రగతికి 4,834, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి 12,000 కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ మంత్రాన్నే జపించింది. ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఎస్సీలు, బీసీలను ఆకట్టుకునేందుకు వారికి కేటాయింపులు ఎక్కువ జరిపింది. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈసారి రుణమాఫీకి నిధులు కేటాయించింది.. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన హరీష్ రావు… కేంద్రం ఇచ్చే గ్రాంట్ల పై ఎక్కువ ఆధారపడ్డట్టు వివరించారు.. ఇక డబుల్ బెడ్ రూమ్ పథకం, సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షలు, దళిత బంధు వంటి పథకాలకు కేటాయింపులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినట్టు కనిపిస్తోంది..