Telangana BJP Collecting Funds: డబ్బులు ఎవరికీ ఊరికే రావు. లలిత జ్యూవెల్లర్స్ కిరణ్ కుమార్ నుంచి గౌతమ్ ఆదానీ వరకు బంగారమో, బొగ్గో ఏదో ఒకటి అమ్మాలి. ఇక జాతీయ స్థాయి ఎడమ వాటం పార్టీల నుంచి కొంగరకలాన్ లో ప్రగతి నివేదన పేరిట సభలు నిర్వహించే టీఆర్ఎస్ వరకు చందాల పేరుతో పైసలు కావాలి ఈ చందాలు మొత్తం బ్లాకే గనుక బయటకి రావు. పేరుకు విరాళాల మాదిరిగానే ఉంటయి గానీ మై హోం రామేశ్వరుడో, మేఘా పిచ్చిరెడ్డో, హెటిరో పార్థుడో ఇచ్చే భూరీ విరాళాల లెక్కలు వేరేలా ఉంటయి. పార్టీలు అంటేనే ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు..ఆ ఓటేసే ప్రజల కోసం ఆ విరాళాల్లో కొంత మినహాయించుకుని పార్టీలు, ఆ పార్టీలు ఇచ్చిన కొంత జేబులో వేసుకుని నాయకులు. ఇంకొంత నగదును వచ్చే ప్రజల కోసం, కార్యకర్తల కోసం బీర్లు, బిర్యానీల కోసం ఖర్చు చేస్తారు. కానీ మేం వేరు, మా పంథా వేరు అని పదే పదే కుటుంబ పార్టీలను, ఎడమ పార్టీలను దెప్పి పొడిచే కమల నాయకులు ఈసారీ “చందా” పే చర్చకు తెర లేపారు.
మోదీ వస్తున్నారని
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మోదీ నుంచి నడ్డా వరకు వస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ నేతృత్వంలో రివ్యూలు జరుగుతున్నయి. లక్ష్మణ్ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు అవుతున్నయి. కానీ ఇవన్నీ పని చేయాలి అంటే పైసలు కావాలి. ఇప్పుడు ఆ పైసల కోసమే కమలనాథులు కష్ట పడుతున్నారు.
Also Read: Opposition Dominance Fight: విపక్షాల ఆధిపత్య పోరు.. అధికార బీజేపీకే లాభం!
అధిష్టానం ఇవ్వడం లేదా
8 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటున్న బీజేపీ ఖాతాలో ₹ 6 నుంచి 7 వేల కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ లాగా నేషనల్ హెరాల్డ్ కు ఇచ్చినట్టు బీజేపీ అప్పులు ఇవ్వదు. రాష్ట్ర శాఖలకు ఇచ్చే వాటిల్లోనూ పొదుపు పాటిస్తుంది. బీజేపీకి పొదుపు సూత్రం.. మదుపు మంత్రం తెలుసు కాబట్టే పైసలను వృథా ఖర్చు కానివ్వదు. ఇక అమ్మ ఎలాగూ పెట్టదు ఇక అడుక్కోవడమే శరణ్యం అని వచ్చే నెలలో జరిగే సమావేశాలకు కార్యకర్తల నుంచి నాయకులు దాకా చందాల వసూలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే నాయకులకు విడిది, తింటి టిఖానా చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక భారీ విరాళాలే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం శ్రమిస్తోంది.
మెచ్చేలా ఏర్పాట్లు
హెచ్ఐసిసిలో నిర్వహించిన సమావేశాలకు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు వస్తుండటంతో ఏర్పాట్లను నాయకులు ఆదే స్థాయిలో చేస్తున్నారు. వంటలు, శామీయానాలు అన్నింటా ధనిక తెలంగాణ రిచ్ నెస్ చూపేందుకు కష్ట పడుతున్నారు. సీఎం రేసులో ఉన్న సంజయ్ నుంచి ఫైర్ బ్రాండ్ రఘు నందన్ వరకు వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
వాళ్ళు దగ్గరయ్యారా?
రాజకీయ నాయకులకు శాశ్వత వ్యాపార మిత్రులు ఉండరు. తెలంగాణ ఏర్పాటు నుంచి మొన్నటి దాకా కేసీఆర్, మై హోం రామేశ్వరరావు భాయి భాయి. ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తర్వాత ఆ బంధం ముగిసింది. ఇప్పుడు మై హోం నడక కమలం వైపు సాగుతోంది. పేరుకి వెలమ అయినా నచ్చకుంటే ఎంతటి వారినైనా కేసీఆర్ కట్ చేస్తారు. ఇప్పుడు జాతీయ సమావేశాలు ఉండటం.. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పైసలు కావాల్సి ఉండటంతో మై హోం “నేను విన్నా నేను ఉన్నా” అనే సంకేతాలు పంపుతోంది. మై హోం మీద మొన్నటి దాకా ఫైర్ అయిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. బండి నుంచి రఘునందన్ వరకు ఎప్పుడూ మై హోం ను ఒక్క మాట అనలేదు. నితిన్ గడ్కరీ చేస్తున్న మేళ్ళను దృష్టిలో పెట్టుకొని “మేఘా కంపెనీ” కూడా భారీగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఇవి వేరే లెక్కలోకి వెళ్తాయి కాబట్టి పార్టీ చందాలు వసూలు చేస్తున్నది.
అందుకే వస్తున్నారా
మోదీ ఈ మధ్య గుజరాత్ తర్వాత అధిక సార్లు వచ్చింది తెలంగాణకే. హైదరాబాద్ కు ఆయన వచ్చినన్నీ సార్లు కేసీఆర్ ఇక్కడ లేరు. ఈ మధ్య కేసీఆర్ కూడా కేంద్రాన్ని తూర్పార బడుతున్నారు. ఒక్కో సారి కారణం లేకుండా తిడుతున్నారు. డబుల్ ఇంజన్ అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటుంటే కేసీఆర్ అండ్ కో మాత్రం ట్రబుల్ ఇంజన్ అని గేలి చేస్తోంది. మోదీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వెళ్ళే రూట్లో “మోదీ మాకు ఏం ఇచ్చావు” అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మోదీ అసలే ఎదురు ప్రశ్నను తట్టుకోలేడు కనుక ఈసారీ కావాలనే హైదరాబాద్ ను ఎంచుకున్నారు. మరోసారి పరోక్షంగా కేసీఆర్ ను ప్యాంపర్ చేసేందుకు రెడీ అయ్యారు.
Also Read:BYJU’s in AP Govt Schools: జగన్ సర్కార్, బైజూస్.. కొత్త ఒప్పందం కథేంటి?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana bjp collecting funds for narendra modi meet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com