తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కసరత్తులు చేస్తున్నాయి. దళితబంధు పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి ప్రయోజనాలపై చర్చించేందుకు తయారుగా ఉంది. దీంతో శాసనసభ సమావేశాలపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. కీలక బిల్లులకు కూడా ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి సమస్యలు, ధాన్యం కొనుగోలు, ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి. రాష్ర్టంలోనెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు గోల చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యేందుకు తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నాయి.
శాసనసభ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దళితబంధు పథకంపై సుదీర్ఘ చర్చ జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సైతం కాలు దువ్వుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల విషయంలో ఏం చెబుతారో అని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.
రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, రుణమాపీ, దళితబంధు, సాగునీటి ప్రాజెక్టులు, పొరుగు రాష్ర్టంతో సంబంధాలు తదితర విషయాలపై అసెంబ్లీ వేదికగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో పలు సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించేందుకు సిద్ధం అవుతున్నాయి.