
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి తమ ప్రతిష్ట చూపించుకోవాలని తపిస్తున్నాయి. ఎంపీపీ పీఠం అధిరోహించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. దీనికో ప్రత్యేకత ఉంది. ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ సొంత మండలం ఇంది. దీంతో ఇక్కడ వైసీపీ తన ప్రభావం చూపించాలని భావిస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ తనకు ఇక్కడి నుంచే ఓటు కావాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో వైసీపీ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కీలకమైన మండల అధ్యక్ష పదవి కోసం మరింత రసవత్తర సన్నివేశాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
నామినేషన్ల సమయంలో దుగ్గిరాల-1లో టీడీపీ, ఈమనిలో జనసేన అభ్యర్థుల నామినేషన్ల చెల్లవని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదించడంతో వారి నామినేషన్లు ఆమోదించారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఉండగానే దుగ్గిరాల-1, 3 టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరారు. పెదకొండూరు స్థానంలో 63 ఓట్లతో జనసేన అభ్యర్థి విజయం సాధించగా రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టగా మరోసారి లెక్కించగా 39 ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిచినట్లుగా గుర్తించారు. కానీ మరోసారి వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ రీ కౌంటింగ్ నిర్వహించగా జనసేన అభ్యర్థి 20 ఓట్ల తేడాతో వైసీపీపై ఓటమి సాధించినట్లు ప్రకటించారు.
దీంతో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన 1 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో దుగ్గిరాల ఎంపీపీ సీటు కోసం బీసీ మహిళ రిజర్వేషన్ అయింది. ఈ క్రమంలో టీడీపీ నుంచి గెలిచిన చిలువూరు 1 అభ్యర్థి షేక్ జబీన్ బీసీ అభ్యర్థి కావడంతో ఆమెకే పదవి దక్కుతుందని భావించారు. కానీ ఇక్కడ మరో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. షేక్ జబీన్ కు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకపవడంతో ఆమె దరఖాస్తు తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కలెక్టర్ ను కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అన్నదే అనుమానం. నారా లోకేష్ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుండడంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరోవైపు ఇది అమరావతి రాజధాని పరిధిలో వస్తుండడంతో ఎంపీపీ పీఠం సాధించాలని రెండు పార్టీలు తలపిస్తున్నాయి.