KCR : దేశాన్ని ఏలుదామని బయలు దేరిన పెద్దమనిషి.. మోడీని ఢీకొట్టాలని తపన పడుతున్నాడు. టీఆర్ఎస్ ను పీకి పారేసి బీఆర్ఎస్ గా మార్చాడు. దేశ్ కీ నేత అంటున్నాడు. కానీ దేశాన్ని కొట్టాలంటే ముందు తెలంగాణ గుదిబండను దాటాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయాన్ని నమోదు చేయాలి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ సానుభూతి వెల్లివిరుస్తోంది. రెండు సార్లు ఓడిన కాంగ్రెస్ ను ఈసారి గెలిపించాలని ప్రజల మైండ్ సెట్ మారుతోంది. అయితే గెలుపుపై మాత్రం బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆందోళనగా ఉన్నారు. నిన్నటి సభలో ఓడిస్తే ‘ఐదేళ్లు రెస్ట్ తీసుకుంటాం’ అంటూ నిర్వేదపు మాటలు మాట్లాడాడు. చూస్తుంటే 2023 ఎన్నికలను ఆయన ‘ఇజ్జత్ కే సవాల్’గా పరిగణిస్తున్నారని చెప్పవచ్చు. ఓడిపోతే రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ ముఖం చూపించుకోలేడు. మోడీ అటు రాష్ట్రంలో వరుసగా.. దేశంలోనూ వరుసగా పదవులు చేపట్టారు. మన కేసీఆర్ సార్ కు ఆ యోగం ఉందో లేదో చూడాలి.
2014, 2018 ఎన్నికల కంటే 2023 ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ కు జీవనర్మణ సమస్యగా మారాయి. నామినేషన్ల దాఖలు పూర్తయ్యే వరకు రంగంలోకి దిగకుండా కేసీఆర్ ముందే జనంలోకి వెళ్లడానికి కారణం ఇదే.. మునుపటి కంటే కేసీఆర్ చాలా కష్టపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అప్పట్లో ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేశారు. 2014లో బీఆర్ఎస్ నినాదంగా ప్రత్యేక తెలంగాణ నిలిచింది. 2018 లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును బూచీగా చూపి ‘ఏపీ నాయకుల పాలన అవసరమా’ అనే దానిపై కేసీఆర్ టార్గెట్ చేసి తన పార్టీ వైపు ఓటర్లను ప్రభావితం చేశాడు.
ఈసారి ఇంకా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకున్నా బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ, సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు కేసీఆర్.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఇంతలా ప్రచారం చేయడానికి ఊరువాడా తిరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసి బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాలని ఆయన తొందరపాటు చూస్తుంటే తేడా కొడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ సీఎం సీటు కోసం ఈసారి పోటీ పెరిగింది. కుటుంబ పాలన, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం వంటి ఇతర సమస్యలను కూడా కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. వీటిపై ప్రతిపక్ష పార్టీలు అధికార బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి.
అంతేకాకుండా, పార్టీ జాతీయ పార్టీగా నమోదు కావడంతో కనీసం 2-3 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తున్నారు. కానీ కాంగ్రెస్ గాలి వీస్తుండడంతోనే నిర్వేదంగా కనిపిస్తున్నారు. చూస్తుంటే 2023 ఎన్నికలు కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్ వంటివని చెప్పకతప్పదు. ఓడిపోతే మాత్రం మోడీ సహా వరుసగా సీఎంలు అయిన ముఖ్యమంత్రుల సరసన కేసీఆర్ ను చూడలేము. ఆ ట్రాక్ రికార్డును కేసీఆర్ కొనసాగిస్తారా? లేదా? అన్నది చూడాలి.