CM KCR: తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారం చేసుకున్న తర్వాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)కు ఈసారి ఎన్నికల్లో ఉద్యమకారులే దడపుట్టించే అవకాశం కనిపిస్తోంది. సబ్బండ వర్గాల ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తానొక్కడినే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తానొక్కడి ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్న భావనను ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం చేస్తున్నారు. ఇలా మాట్లాడడం ఈసారే కాదు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఇలాగే ప్రచారం చేసుకున్నారు. ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని చెప్పడంతో అందరూ కేసీఆర్ మాటలు నమ్మారు. కానీ, స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1,200 మంది కుటుంబాల్లో సగం మందికి కూడా ఇప్పటి వరకు న్యాయం జరుగలేదు. దీంతో ఈసారి కేసీఆర్ మాటలు నమ్మకుండా ఉద్యమించేందుకు ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు.
కీలక స్థానాల్లో నామినేషన్లు…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో వందలాదిగా నామినేషన్లు వేసి కల్వకుంట కుటుంబానికి బుద్ధి చెప్పాలనిఇ అమర వీరుల కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల, సిద్ధి పేటలో శుక్రవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీతో కలిసి నామినేషన్లు వేసి బుద్ధి చెప్తామని అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి అన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడానికి కల్వకుంట్ల కుటుంబానికి సమయం లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పడానికి, తెలంగాణను రక్షించు కోవడానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, దళిత బిడ్డలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల నియోజక వర్గాల్లో వందలాది నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అడ్రస్ దొరకడం లేదని..
తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణాలు అర్పించారని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పదే పదె చెబుతున్నారు. సోనియాగాంధీ 1,200 మంది ప్రాణాలు బలి తీసుకున్న బలిదేవత అని ఆరోపిస్తున్నారు. తెలంగాణపై ప్రేమతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని, విధిలేక ఇచ్చారని పేర్కొంటున్నారు. ఇంత స్పష్టంగా 1,200 అమర వీరులు అని చెబుతున్న ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, ఆర్థిక మంత్రి పదేళ్లలో వారిని గుర్తించే ప్రయత్నం చేయలేదు. సకల జనుల సర్వేతో అందరి డేటా తమ వద్ద ఉందని చెబుతున్న గులాబీ నేతలు, అమర వీరుల అడ్రస్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. పదేళ్లలో కేవలం 600 అమరుల కుటుంబాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. మిగతా 600 కుటుంబాల అడ్రస్ లేదని చెబుతోంది.
తెలంగాణ వ్యతిరేకులకు అందలం..
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఉద్యమకారులకు స్వరాష్ట్రంలో గౌరవం దక్కడం లేదు. ఇందుకు తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లే ఉదాహరణ. ఆమెకు పదవి ఆశ చూపుతూ పదేళ్లు కేసీఆర్ పబ్బం గడిపారు. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అయినా ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కానీ ప్రగతి భవన్‌కు పిలిపించి సత్కరించి పంపించారు. ఇక ఎంతో మంది అమరులను, ఉద్యమనేతలను పక్కన పెట్టేశారు. తెలంగాణను వ్యతిరేకించిన నాయకులను ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులను చేశారు. దీంతో తెలంగాణ ఉద్యమకారులు ఈసారి తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. వీరి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
ముదిరాజ్‌లను మచ్చిక చేసుకునే ప్రయత్నం..
ఇప్పటికే అసెంబ్లీ టికెట్లలో ముదిరాజ్‌లకు మొండిచేయి ఇచ్చిన గులాబీ బాస్, ముదిరాజ్ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ పార్టీల్లోని ముదిరాజ్ నేతలను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. అయితే నేతలు చేరినంత మాత్రాన ఓటర్లు చేరతారా అన్నది సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికే ముదిరాజ్‌ల విషయంలో తప్పటడుగు వేసి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌కు తాజాగా తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాల రూపంలో మరో షాక్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.