https://oktelugu.com/

ACB Raids : రెవెన్యూ అంటేనే దోచుకోవడం.. ఈమె అందులో పీహెచ్ డీ చేసింది

అయినప్పటికీ కొంతమంది రెవెన్యూ అధికారులు మారడం లేదు. పైగా అక్రమ సంపాదనకు వెనుకాడటం లేదు. రజిని ఐదుసార్లు ఏసీబీకి చిక్కకుండా జాగ్రత్త పడింది.. చివరికి ఫిర్యాదులు వెళ్లడంతో చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఏ ఒక్క సారి కూడా లంచం తీసుకోవడం తప్పు అని ఆమె భావించలేదు. అందుకే ఇవాళ ఆమెకు ఈ దుస్థితి.

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2024 / 09:15 PM IST
    Follow us on

    ACB Raids : నిన్నటి నుంచి.. మీడియా, సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ.. అది ఓ ఎమ్మార్వో గురించి. ఆమె సంపాదించిన సంపాదన గురించి.. ఆమెను ఇన్ని రోజులు కాపాడిన వ్యక్తుల గురించి.. ఐదుసార్లు ఏసీబీ నుంచి తప్పించుకోవడం గురించి.. మొత్తానికి పాపం పండింది. మేడం గారి అక్రమ లావాదేవీలు, అడ్డగోలు సంపాదనలు, కూడబెట్టిన భూములు, దాచిన బంగారు, నగదు నిలువలు.. రఫ్ గా లెక్కేస్తే కోట్లల్లోనే ఉంటుందట లెక్క. ఇలాంటి అధికారులను చూసిన తర్వాత.. ఇలా అడ్డగోలుగా సంపాదిస్తున్న తీరును పరిశీలించిన తర్వాత.. మేం తీసుకొచ్చిన ధరణి గొప్పది.. మేం చేసిన రెవెన్యూ మార్పులు గొప్పవి అని.. గత ప్రభుత్వం అంటే అంతకుమించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. పైగా సదరు అవినీతి అధికారికి అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు అండదండలు అందించారట.. ఆయనకు ఈ అధికారిణి సమీప బంధువట.. ఇంకేముంది ఇదే అదునుగా మేడంగారు రెచ్చిపోయింది. దర్జాగా సంపాదించుకుంది..

    రెవెన్యూ శాఖలో రజిని చేసేది తహసీల్దార్ స్థాయి ఉద్యోగం అయినప్పటికీ.. ఆమె ఆర్డిఓ రేంజ్ లో చక్రం తిప్పేదట. వివాదాస్పద భూములు, వివాదాస్పద స్థలాలను వెతికి మరి వాటికి రెక్కలు వచ్చేలా చేసేదట. ఆ పని చేసినందుకు బ్రహ్మాండంగా పుచ్చుకునేదట. హనుమకొండలోని కే ఎల్ ఎన్ రెడ్డి కాలనీలో ఆమె ఉంటున్న నివాసం లో అధికారులు తనిఖీలు చేస్తే కళ్ళు చెదిరిపోయే స్థాయిలో విలువైన వస్తువులు బయటపడ్డాయట. కేవలం అక్కడ మాత్రమే కాకుండా మరో అయిదు చోట్ల ఆమె సమీప బంధువుల ఇళ్లపై కూడా అధికారులు సోదరులు చేశారు. గతంలో రజిని ధర్మసాగర్ మండలంలో పనిచేశారు. అక్కడ పనిచేసినప్పుడు భారీగానే వెనకేసుకున్నారట. అధికారుల తనిఖీల్లో ఇంటి స్థలాలు, వ్యవసాయ భూముల దస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర డాక్యుమెంట్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. 25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించి.. బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి, దాన్ని సీజ్ చేయించారు.

    ఇక రజిని ఆస్తులను ప్రభుత్వపరంగా లెక్కిస్తే 3.12 కోట్లు గా ఉంటుందని.. బహిరంగ మార్కెట్లో అయితే 12 కోట్ల దాకా ఉంటుందని కరీంనగర్ ఏసీబీ చెపుతున్నారు. ఇది ప్రాథమిక దర్యాప్తు మాత్రమేనని, ఇంకా తవ్వుతుంటే చాలా చరిత్ర ఉందని ఆయన ప్రకటించారు. ఇక ఆమెకు సంబంధించిన 12 కోట్ల అక్రమ ఆస్తుల్లో రెండు అంతస్తుల బిల్డింగు, 21 ఇళ్ల ప్లాట్లు, ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, 25 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కిలోన్నర బంగారు ఆభరణాలు, రెండు కార్లు, ఇప్పుడు ద్విచక్ర వాహనాలు, లక్షన్నర నగదు వరకు ఆమె ఆస్తుల జాబితాలో ఉన్నాయి. సోదాల తర్వాత ఆమెను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. రజిని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాయంపేట, హసన్ పర్తి, ధర్మసాగర్ మండలాల్లో పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బదిలీపై జమ్మికుంట వచ్చారు. జమ్మికుంట కంటే ముందు పనిచేసిన మండలాల్లో వివాదాస్పదంగా వ్యవహరించారు. గత ప్రభుత్వం ఆ విషయాలను పక్కన పెట్టినప్పటికీ.. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఏసీబీకి విస్తృతమైన అధికారాలు ఇవ్వడంతో.. ఇలాంటి అవినీతి అధికారుల లీలలు బయటపడుతున్నాయి.

    ఆ మధ్య ఓ తహసీల్దార్ ఇలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. భర్తను పోగొట్టుకుంది. చివరికి మానసికంగా క్షోభను అనుభవించింది. అనంతరం ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ పై కొంతమంది పెట్రోల్ పోసి.. నిప్పు అంటించారు. ఇలాంటి కోకొల్లలు.. అయినప్పటికీ కొంతమంది రెవెన్యూ అధికారులు మారడం లేదు. పైగా అక్రమ సంపాదనకు వెనుకాడటం లేదు. రజిని ఐదుసార్లు ఏసీబీకి చిక్కకుండా జాగ్రత్త పడింది.. చివరికి ఫిర్యాదులు వెళ్లడంతో చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఏ ఒక్క సారి కూడా లంచం తీసుకోవడం తప్పు అని ఆమె భావించలేదు. అందుకే ఇవాళ ఆమెకు ఈ దుస్థితి.