Teenmar Mallanna
Teenmar Mallanna : గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న పై కేసులు పెట్టింది.. నాడు తీన్మార్ మల్లన్న ఆ కేసుల నుంచి బయటపడేందుకు బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన కొద్దిరోజులకే అందులో నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు తాగిన న్యూట్రల్ జర్నలిస్ట్ గానే ఉన్నారు. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి పై విరుచుకుపడేవారు. అవకాశం దొరికితే చాలు కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు.. కొన్నిసార్లు అవి హద్దులు దాటేవి. అనంతరం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా.. ప్రశ్నించే గళంగా తనను తాను చెప్పుకున్నారు. ప్రభుత్వం చేసిన కుల గణనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఓ సామాజిక వర్గాన్ని ఇష్టానుసారంగా తిట్టారు. అది కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. దీంతో సంజాయిషి ఇవ్వాలని తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరింది. దానికి ఆయన బదులు ఇవ్వలేదు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.
Also Read : సర్ ప్రైజ్ : తీన్మార్ మల్లన్న బ్యాచ్ బీఆర్ఎస్ భజన చేస్తోందేంటి?
వెనుక ఉన్నది కేసీఆరేనా
ఇటీవల తీన్మార్ మల్లన్న హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న పక్కన ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిపిఆర్ఓగా పనిచేసిన ఘటిక విజయ్ కుమార్ కనిపించారు. గటిక విజయ్ కుమార్ చాలా సంవత్సరాల పాటు కేసీఆర్ దగ్గర సిపిఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనను కెసిఆర్ బయటకు పంపించారు. ఇప్పుడు విజయ్ కుమార్ ఐ న్యూస్ లో కీలక పదవిలో ఉన్నారు. అయితే తీన్మార్ మల్లన్న వెనుక విజయ్ కుమార్ కనిపించడం సంచలనం కలిగించింది. కాంగ్రెస్ పార్టీపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీన్మార్ మల్లన్న ఈ స్థాయిలో విమర్శలు చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని.. అందువల్లే విజయ్ కుమార్ ను పంపించారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. గటిక విజయ్ కుమార్ ను కేసీఆర్ ఎప్పుడు బయటకు పంపించారని.. తీన్మార్ మల్లన్న కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని.. అలాంటి వ్యక్తిని కెసిఆర్ ఎందుకు చేరదీస్తారని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరో ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం లేదని.. ఆ ప్రభుత్వమే రోజు ఇరకాటం లో పడుతోందని గులాబీ నేతలు అంటున్నారు. కెసిఆర్ రాజకీయంగా అపర చాణక్యుడని.. అటువంటి వ్యక్తికి తీన్మార్ మల్లన్నతో అవసరం ఏంటని వారు గుర్తు చేస్తున్నారు.. భారత రాష్ట్ర సమితి దగ్గర తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని.. కెసిఆర్ కనుసైగ చేస్తే రెచ్చిపోతారని వారు వివరిస్తున్నారు. అయితే రాజకీయాలలో ఇలా ఉండకూడదనడానికి లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్ కెసిఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారని.. ఇప్పుడు అదే శ్రవణ్ కు కెసిఆర్ ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
Also Read : స్వపక్షంలోనే విపక్షంలా.. తెలంగాణ కాంగ్రెస్‌కు ‘తీన్మార్’ తలనొప్పి..!