spot_img
Homeజాతీయ వార్తలుTS Government Teachers Salary: జీతాలు ఇంకా రాకపాయే.. సమస్యలు తీరపాయే.. తెలంగాణ తెచ్చుకుని ఏం...

TS Government Teachers Salary: జీతాలు ఇంకా రాకపాయే.. సమస్యలు తీరపాయే.. తెలంగాణ తెచ్చుకుని ఏం లాభం?

TS Government Teachers Salary: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రత్యేక రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామా అన్న భావన వ్యక్తమవుతోంది. స్వరాష్ట్రం సాధించుకున్న తొమ్మిదేళ్లలో ఉద్యోగుల పరిస్థితి ఏటా దిగజారుతోంది. ఠంచన్‌గా ఒకటో తారీఖు జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. పెండింగ్‌ బిల్లులు, డీఏల పెండింగ్, ఇతర సమస్యలు అదనం. ప్రతినెలా ఈఎంఐలు కూడా ఫైన్‌తో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు.

ఇంకా జీతం పడలే..
పేరుకు ధనిక రాష్ట్రం..దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెనక్కి నెట్టి వృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంత వరకూ ఏప్రిల్‌ నెల జీతాలు అందనేలేదు. 33 జిల్లాల్లో సుమారు 14 జిల్లాలకు వారి వారి ఖాతాల్లో జీతాలు జమ కాలేదని సమాచారం. ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఎదరుచూసుడేందని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వచ్చినా ఇంకా ఇంత వరకు జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

19 జిల్లాల వారికే జీతాలు..
సోమవారం సాయంత్రం వరకు దాదాపు 19 జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు అందినట్లు సమాచారం. మిగతా జిల్లాల టీచర్లకు ఎప్పుడు అందుతాయో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. సోమవారం వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్ధిపేట, నిర్మల్‌ జిల్లాల్లోని వారికి బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. ఆదివారం నాటికి 12 జిల్లాల వాళ్లకు జీతాలు అందాయి. ఒకేసారి కాకుండా విడతలవారీగా కొన్ని కొన్ని జిల్లాలకు వేతనాలను విడుదల చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈనెల 8 వరకు కేవలం 19 జిల్లాలకు మాత్రమే జీతాలు జమయ్యాయి.

ఫస్ట్‌ నాడే ఎందుకివ్వరు?
ఫస్ట్‌ తారీఖు నాడే జీతాలు ఎందుకివ్వరని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి జీతాలు అందకా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసమో, పిల్లల చదువుల కోసమో, గృహ, ఇతరరత్ర అవసరాల కోసం బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తీసుకున్న రుణాలకు ఈఎంఐలు ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు కట్టాల్సి ఉండడంతో జీతాలు ఆ తేదీల్లో తమ ఖాతాల్లో జమకాకపోవడంతో చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని, సిబిల్‌ స్కోర్‌ తగ్గుతుందని ఉపాధ్యాయ సంఘ నేత పేర్కొన్నారు.

కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్‌..
తెలంగాణ రాష్ట్రంలో ఔట్‌ సోర్సింగ్‌ అనే మాటే ఉండదని, అంతా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ నాడు ఉద్యమ సారథిగా ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారిని రెగ్యులర్‌ చేస్తామని పలుమార్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీలోనూ ప్రకటన చేసిన సీఎం.. 2016లో ఒక జీవో ఇచ్చినప్పటికీ దానిపై హైకోర్టులో పిల్‌ పడింది. దీనిని ఇటీవల కోర్టు కొట్టివేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నది. ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌కు రిక్రూట్‌మెంట్‌లో వారికి ప్రాధాన్యం ఇచ్చే విషయం, వయసు విషయంలో సడలింపులు కలిగించే వంటి వాటిపై పీఆర్సీ సిఫార్సులు చేసినా పక్కన పెట్టేసింది. ఫలితంగా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు తక్కువ జీతాలు తీసుకోవడమే కాకుండా, ఏ టైంలో తమ ఉద్యోగం పోతుందోననే ఆందోళనలో ఉన్నారు.

ఖాళీల భర్తీలోనూ జాప్యం..
ఇక రాష్ట్రంలో లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తోంది. మరోవైపు ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలోనే రిక్రూట్‌ చేసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. భర్తీ చేస్తామని చెప్పిన ఖాళీల్లో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు చూపించకుండా లెక్కలు తయారు చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌పై ఒక విధానాన్ని తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైంది. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతున్నది

అసెంబ్లీలో ప్రకటించినా..
రాష్ట్రంలో 80 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని గత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 40 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. మిగత 40 వేల ఖాళీలు అలాగే ఉన్నాయి. నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రూప్‌ ఉద్యోగాల పరీక్షలు కూడా ప్రశ్నపత్రాల లీకేజీలో ఆగిపోయాయి. కొన్ని దరఖాస్తు దశలో ఉన్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ఉద్యోగాలే భర్తీ కాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాస నెలకొంటోంది.

నిధులు లేకనే సమస్య..
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో జాప్యానికి ప్రధానంగా నిధుల సమస్యే ఎదురవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతోనే జాప్యం చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ను రెగ్యులర్‌ చేయడమా, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో ప్రయారిటీ ఇవ్వడమా ఏదో ఒకటి విడతల వారీగా కంప్లీట్‌ చేయాలంటున్నారు. వ్యవస్థను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఇది అమలు కాలేదు. కనీసం సమాన పనికి సమాన వేనతం కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వెంటనే స్పందించి ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులేషన్‌ చేయాలని వారు కోరుకుంటున్నారు..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular