YCP Vs TDP: ఏపీలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అవసరమని వైసిపి భావిస్తోంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి అధికారంలోకి రావాల్సిందేనని తేల్చి చెబుతోంది. అందుకే ” వై ఏపీ నీడ్స్ జగన్” పేరిట వైసిపి ఓ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నాలుగున్నర ఏళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యింది. ఈనెల 26 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి 20 సంక్షేమ పథకాలను అస్త్రంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని వైసిపి డిసైడ్ అయ్యింది.
ఇటీవల పార్టీ శ్రేణులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో జగన్ విజయవాడలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కీలక సూచనలు ఇచ్చారు. అందులో భాగంగానే ” వై ఏపీ నీడ్స్ జగన్” ప్రచార కార్యక్రమం గురించి వివరించారు. ప్రతి ఇంటి తలుపు తట్టాలని.. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి ఎందుకు రావాలో? అందుకు గల కారణాలను పూర్తిస్థాయిలో వివరించాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఆదేశించారు.
అయితే వైసిపి ప్రచార కార్యక్రమానికి విరుగుడుగా తెలుగుదేశం పార్టీ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ” ఏపీ హేట్స్ జగన్ ” పేరుతో ఒక కొత్త స్లోగన్ ను వినిపించడానికి డిసైడ్ అయ్యింది. మళ్లీ నువ్వు ఎందుకు కావాలి? నీ డబ్బు పిచ్చితో ప్రజల జీవితాలను నాశనం చేసేందుకా? ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడానికా? పన్నుల రూపంలో బాదేసేందుకా? అమరావతిని సర్వనాశనం చేసేందుకా? మూడు రాజధానుల రూపంలో మభ్య పెట్టేందుకా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ” ఏపీ హేట్స్ జగన్ ” స్లోగన్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టిడిపి డిసైడ్ అయ్యింది.
గతంలో సైతం జగన్ సర్కార్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రకటించింది. నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల ముంగిటకు వెళ్లారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడికక్కడే ప్రజల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురయ్యాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అన్న కార్యక్రమాన్ని రూపొందించింది. వైసీపీ సర్కార్ చర్యలను ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమం సాగింది. విపక్షం కావడం, ప్రజా సమస్యలు లేవనెత్తడంతో ప్రజల నుంచి అనుహస్పందన లభించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని టిడిపి నేతలు చెబుతున్నారు. తాము ఇచ్చే స్లోగన్ విజయవంతం అవుతుందని ఆశాభావంతో ఉన్నారు.వైసిపి ప్రచార కార్యక్రమానికి ప్రజా గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.