TDP Janasena Alliance: మీడియాలో ‘ఎల్లో మీడియా వేరయ’ అన్నట్టుంటది వ్యవహారం. తెలుగు నాట ఎటువంటి రాజకీయాలనైనా కనుసైగలతో శాసించాలని చూస్తారు ఎల్లో మీడియా అధిపతులు. అందు కోసం ఎంటి రాతలకైనా సిద్ధపడతారు. అవసరమనుకుంటే అందలమెక్కిస్తారు. అవసరం లేదనుకుంటే మాత్రం ఎంతగా తొక్కాలో అంతలా కిందపడేస్తారు. పేరుకే మీడియా కానీ.. ఆ ముసుగులో తెలుగునాట రాజకీయాలు చేసేది వారే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తరువాత కొంత పరిస్థితి మారింది. అయితే జగన్ మీడియా సామ్రాజ్యంలోకి వచ్చాక నీలి మీడియా ఎంటరైంది. ఇప్పుడు తెలుగునాట ఉన్నది మూడే మీడియాలు. ఎల్లో మీడియా, నీలి మీడియా, తటస్థ మీడియా. ముందు రెండు వన్ సైడ్ గా ఉంటాయి. ఇక తటస్థ మీడియాలైతే యాడ్స్, ఇతరత్రా ప్రయోజనాలను ఆశించి తమ గాలివాటంను మార్చుకుంటూ వస్తాయి.

అయితే తెలుగునాట టీడీపీ తప్పించి మరో ప్రాంతీయ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యం ఎల్లో మీడియాది. అందుకు ఎంతకైనా తెగించే గుణం వారిది. మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం రావడాన్ని తట్టుకోలేకపోయారు. ప్రచారం కల్పించలేదు సరికదా.. దుష్ర్పచారంతో ఎంత పలుచన చెయ్యాలో అంతలా చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే వరకూ తమ వంతు పాత్ర పోషించారు. పీఆర్పీ రూపంలో మరో ప్రాంతీయ పార్టీ ఆప్షన్ లేకుండా చేయడమే వారి ధ్యేయం. ఇప్పుడు జనసేన విషయంలో సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. పవన్ అవసరం అనుకున్న సమయంలో పతాక శీర్షికన కథనాలు ప్రచురిస్తున్నారు. అవసరం లేదని అనిపిస్తే మాత్రం ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు.
మొన్న ఆ మధ్య చంద్రబాబును పవన్ కలిసినప్పుడు ఆకాశానికెత్తేశారు. విశాఖలో పవన్ ను అడ్డుకుంటే చంద్రబాబు సంఘీభావం తెలిపారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకుంటే పవన్ పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో ఎల్లో మీడియా సృష్టించిన హడావుడి అంతాఇంతా కాదు. పొత్తులు కుదిరిపోయాయన్నట్టు రాతలు రాశారు. భ్రమ కల్పించారు. అక్కడికి కొద్దిరోజులకే జనసేన నుంచి సీట్లు డిమాండ్ పెరగడం, అధికార భాగస్వామ్యం కావాలని కోరడంతో ఎల్లో మీడియా స్వరం మార్చింది. పవన్ ప్రాధాన్యతను తగ్గించేసింది. లోపలి పేజీల్లో ఏదో మూలన వార్తలను కుదించి వేస్తోంది.

అప్పటికీ.. ఇప్పటికీ ఎల్లో మీడియాకు మాత్రం ఒకటే ధ్యేయం. అది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నిత్యం అధికారంలో ఉండడం, తమ ప్రయోజనాలను పెద్దపీట వేసే చంద్రబాబు సీఎం పీఠంపై ఉండడమే వారి ప్రధాన లక్ష్యం.ఐదేళ్లు అధికారంలోకి వస్తే చాలు.. పదేళ్లు మీడియాను నడపగల నిర్వహణ వ్యయం తెచ్చుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. పైకి మాత్రం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెబుతారు. ఎన్టీఆర్ ఆవిర్భావం నుంచి ఎల్లో మీడియా పురుడుబోసుకుంది. చంద్రబాబు హయాంకు వచ్చేసరికి తెలుగునాట వటవృక్షంగా మారిపోయింది. ఎప్పటి రాజకీయాలకు అనుగుణంగా రంగులు మార్చడం వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అయితే మీడియా ప్రాధాన్యత, ఫోకస్ కు ఉబలాట పడే రాజకీయ పక్షాలు ఉన్నంతవరకూ వారు ఏదిచేసినా చెల్లుబాటవుతుంది.